తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ జిల్లాలో పర్యటించారు. ఆయన ఉత్తరాంధ్రకు రాక రాక వచ్చారు. అది కూడా భారీ ఓటమి తర్వాత అధినేత వేసిన తొలి టూర్ కావడంతో చాలా ఆసక్తి కలిగింది. ఇక నర్శీపట్నంలో జగన్ మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్ళడం కూడా రాజకీయంగా వ్యూహాత్మకమే. స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడు సొంత ఇలాకాలో వైసీపీ రీ సౌండ్ చేయడం ద్వారా పొలిటికల్ గా అది బాగా క్లిక్ అవుతుందని వేసిన మాస్టర్ ప్లాన్ గానే అంతా చూస్తున్నారు.
ఇక వైసీపీ ఉత్తరాంధ్రాలో బాగా చతికిలపడిపోయింది. అంతే కాదు ఓటమి తరువాత నాయకులు అంతా పూర్తిగా డీలా పడిపోయారు. పార్టీ యాక్టివిటీస్ పెద్దగా లేవు ఎటు చూసినా కూటమి మూడు పార్టీల ముచ్చతే కనిపిస్తోంది. ఈ క్రమంలో జగన్ వేసిన విశాఖ జిల్లా టూర్ ఉత్తరాంధ్రాలో పార్టీకి కొంత బూస్ట్ ఇచ్చింది అన్నది వాస్తవం. అంతే కాదు వైసీపీ పట్ల జనాలలో ఉన్న భావన ఏమిటి అన్నది ఎంతో కొంత తెలుసుకునేందుకు ఆస్కారం ఏర్పడింది జగన్ వెంట జనాలు రావడంతో జన సునామీ అని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. ఇక వైసీపీవే ముందున్న రోజులు అని కూడా వారు ధీమాగా చెబుతూ వస్తున్న పరిస్థితి ఉంది.
ఈ నేపథ్యంలో లోకేష్ కూడా చాలా తక్కువ వ్యవధిలోనే విశాఖ వచ్చారు. సాధారణంగా చూస్తే లోకేష్ నెలకు ఒక సారి అయినా విశాఖ పర్యటన చేస్తారు. ఆయన విశాఖలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. ఇక జగన్ వచ్చి వెళ్ళిన మూడు రోజుల వ్యవధిలోనే లోకేష్ కూడా రావడంతో రాజకీయంగా ఇది చర్చకు తావిచ్చింది. అయితే లోకేష్ వచ్చింది రాజకీయ సభల కోసం కాదు, అభివృద్ధి పనుల ప్రారంభం కోసం. ఆయన కలెక్టరేట్ లో అనంతరం అధికారులతో రివ్యూ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడినది చూస్తే అభివృద్ధి విశాఖను తాము ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. విశాఖ భవిష్యత్తుని కూటమి చూసుకుంటుందని విశాఖకు ఎంతో ఉజ్వలమైన ఫ్యూచర్ ఉందని కూడా చెప్పుకొచ్చారు.
ఇక ఇదే సందర్భంలో లోకేష్ జగన్ మీద కూడా హాట్ కామెంట్స్ చేశారు. తమ హయాంలో ఉత్తరాంధ్రాలో అనేక పరిశ్రమలు వస్తున్నాయని అలాగే విశాఖ ఐటీ హబ్ గా కూడా మారిందని ఆయన గుర్తు చేస్తున్నారు. అదే గత ప్రభుత్వంలో విశాఖలో ఏ ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. ఐటీ పరిశ్రమలు ఎందుకు రాలేదో పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధి తాము చేసి చూపిస్తున్నామని అన్నారు.
ఇదిలా ఉంటే జగన్ కి ఆదరణ పెరిగిందని అది కూడా కూటమికి మంచి పట్టున్న ఉత్తరాంధ్రాలో తిరిగి వైసీపీకి పూర్వ వైభవం దక్కుతోందని అంతా విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో ఆ తరహా ప్రచారానికి తనదైన శైలిలో లోకేష్ చెక్ పెట్టేశారు అని అంటున్నారు. అభివృద్ధి అంటే మాది అని ఆయన ఆచరణాత్మకంగా చెప్పేసారు అని అంటున్నారు. అంతే కాదు తమ హయాంలో ఏమి చేశామో కూడా చెబుతూ బిగ్ డిబేట్ ని ముందుకు తెస్తున్నారు. దాంతో వైసీపీ విశాఖకు అయిదేళ్లకు ఏమి చేసిందో చెప్పాలని సవాల్ విసురుతున్నారు. దీంతో జగన్ ఫీవర్ తో ఉన్న వైసీపీ నేతలకు ఈ పరిణామాలు ఏ విధంగా చూడాలో అన్నది తెలియడం లేదని అంటున్నారు.