కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఎట్టకేలకు ఏపీ మీద దృష్టి సారించింది. ఏపీలో కాంగ్రెస్ ని ఏదో విధంగా పైకి లేపాలన్న ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ గా షర్మిల ఉన్నారు. అయితే సీనియర్లు మౌనంగా గుంభనంగా ఉన్నారు. వారిని ఆమె కలుపుకుని పోవడం లేదని ఒక ప్రచారం సాగుతూంటే సీనియర్ల నుంచి ఆమెకు తగిన సహకారం దక్కడం లేదని మరో ప్రచారం ఉంది. ఏది నిజమైనా కూడా కాంగ్రెస్ అధినాయకత్వం చొరవ కోసం అంతా ఎదురుచూశారు. దాంతో కాంగ్రెస్ పెద్దలు ఏపీ విషయంలో కీలక మార్పులకే సిద్ధపడ్డారు.
పీసీసీ చీఫ్ షర్మిల ప్రెసిడెంట్ గా ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇద్దరు సీనియర్లకు నియమించారు. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీల ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమిస్తూ కాంగ్రెస్ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటు కాంగ్రెస్ లోని మిగిలిన సీనియర్లను కలుపుకుంటూ ఏకంగా పాతిక మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది.
కాంగ్రెస్ 25 మంది సీనియర్ నేతలతో పొలిటికల్ అఫైర్స్ కమిటీకి ఛైర్మన్‌గా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ వ్యవహరించనున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రులు పళ్లంరాజు, చింతా మోహన్, జేడీ శీలం వంటి ప్రముఖులకు ఈ కమిటీలో సభ్యులుగా చోటు కల్పించారు. వీరితో పాటు కేవీపీ రామచంద్రరావు, కె.రాజు, మస్తాన్ వలీ, జీవీ హర్షకుమార్, ఎన్. తులసిరెడ్డి వంటి సీనియర్లను కూడా ఈ కమిటీలో భాగంగా తీసుకున్నారు.
ఏపీలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలనే అమలు చేస్తోంది. షర్మిల మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆమెనే పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని అనుకుంటోంది. దానికి కారణాంలు సింపుల్. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీ వద్దకు చేరింది. వైఎస్సార్ కుమారుడు జగన్ ఆయన అసలైన వారసుడిగా భావించి పార్టీ ఆ వైపుగా మారింది. ఇపుడు ఆ వైపు నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని ఈ వైపునకు తీసుకుని రావాలీ అంటే కనుక ఆ అన్న చెల్లెలు షర్మిల పీసీసీ చీఫ్ గా ఉండాలన్నదే కాంగ్రెస్ వ్యూహం అని అంటున్నారు. ఈ విధంగా సెంటిమెంట్ తోనే వైసీపీని దెబ్బ తీస్తూ అదే సమయంలో ఏపీలో కూటమిని ఎదుర్కోవడానికి సీనియర్ల బృందంతో పార్టీ దూకుడు చేస్తుందని అంటున్నారు.
ఏపీలో కాంగ్రెస్ వరస పరాజయాల పాలు అయింది. మూడు ఎన్నికల్లోనూ డిపాజిట్లు అయితే దక్కలేదు. దాంతో ఈసారి చాన్స్ వదులుకోరదని ఎన్నికలకు నాలుగేళ్ళ ముందు నుంచే అన్నీ సిద్ధం చేసుకుందని అంటున్నారు. కాంగ్రెస్ ఉనికి పోరాటం నుంచి తన గత వైభవం దిశగా అడుగులు వేయాలన్నదే ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అదే విధంగా చూస్తే రానున్న కాలంలో షర్మిలను జనంలో ఉంచాలని కూడా ఆలోచన కనిపిస్తోంది అంటున్నారు. షర్మిలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేలాగానే ఈ కొత్త నియమకాలు చేశారు అని అంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నియామకాలకు ఆమోదం తెలిపినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు.