తెలుగుదేశం పార్టీకి ఈసారి అతి పెద్ద మెజారిటీ వచ్చింది. ఒక విధంగా చెప్పాలి అంటే అది బండ మెజారిటీ. మ్యాజిక్ ఫిగర్ కి అవసరం అయిన దాని కంటే 47 మంది ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. అంతే కాదు చాలా మంది కొత్త వారు సభకు వచ్చారు. ఇక తరం తరం మార్పు ఉంటుంది. గతానికి ఇప్పటికీ ఆ తేడా అన్ని చోట్లా కనిపిస్తోంది. రాజకీయాల్లో దూకుడు పెరిగింది. బయట సభలు సమావేశాలలో చాలా ఈజీగా కొన్ని పదాలు ఫ్లోలో దొర్లిస్తూంటారు. అదే ఊపు శాసనసభలో కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడేస్తున్నారు. అంతే కాదు కొందరు వ్యక్తిగత ఎజెండాతో సభలోకి వస్తున్నారు. మరి కొందరు తమ సమస్యలు చెప్పుకోవడాని ఎక్కడా వీలు పడక అసెంబ్లీలో అందరూ ఉంటారు కదా అని బోల్డ్ గా మాట్లాడేస్తున్నారు. దాంతో అసెంబ్లీ ఉన్నది ప్రభుత్వం పనితీరు మీద చర్చించడానికి అని ప్రజా సమస్యల ప్రస్తావన అన్నది తొలి కర్తవ్యం కావాలని కూడా మరచిపోతున్నారు అని కామెంట్స్ వస్తున్నాయి.
ఈసారి సభ జరిగింది కేవలం ఎనిమిది రోజులు మాత్రమే. ఈ ఎనిమిది రోజులూ కూడా రోజుకో విధంగా అధికార సభ్యులే విపక్ష పాత్ర పోషించారని అంటున్నారు బోండా ఉమాతో మొదలైన నిలదీతలు గోరంట్ల దాకా వెళ్ళాయి. ఆ తరువాత కూన రవికుమార్ సుధీర్ రెడ్డి కూడా ఇదే దూకుడు చేశారు. వీటన్నింటికీ అసలైన పరాకాష్ట బాలయ్య స్పీచ్. ఆయన మాట్లాడింది గట్టిగా అయిదు నిముషాలేనేమో. కానీ రచ్చ రచ్చ చేసి పడేశారు అని కామెంట్స్ ఉన్నాయి. ఆ మంట కూటమిని అలాగే మండిస్తోంది.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర అసహనంతో ఉన్నారని అంటున్నారు. సభలో ఒక పద్ధతి ప్రకారం చర్చ సాగాలని ఆయన కోరుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏమి తప్పులు జరిగాయి వాటిని ఏ విధంగా సరిచేస్తున్నామని బాబు ప్రతీ రోజూ చెబుతూ వస్తున్నారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు తమ ప్రభుత్వంలోనే తప్పులు జరిగాయని అంటున్నారు. అంతే కాదు కొన్ని సార్లు వ్యవస్థలలో పనితీరుని ప్రశ్నిస్తున్నారు. అచ్చం ప్రతిపక్షం మాదిరిగా రెట్టిస్తున్నారు. ఇక అనవసర వ్యాఖ్యలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాలయ్య అలాగే ఒక చర్చలో అవసరం అనుకున్నారో లేక వేరే విధంగా ఆలోచించారో దూరిపోయారు. తనకు తోచిన హాట్ కామెంట్స్ చేసి అందరినీ ఇబ్బందుల్లోకి నెట్టారు.
బాలయ్య అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఆ సమయంలో అయితే ఎవరికీ పెద్దగా అర్థం కాలేదని అంటున్నారు. ఆ తరువాత బయట రాజుకున్న రాజకీయ మంట చూసిన తరువాతనే సీన్ మొత్తం అర్థం అయింది అని అంటున్నారు. మెగాస్టర్ ఒక వైపు వైసీపీ మరో వైపు కూటమిని ఇరకాటంలో పెట్టడంతో రెండు రోజులుగా చంద్రబాబుకే ఈ ఇష్యూ అతి పెద్దదిగా తోస్తోంది అని అంటున్నారు. దాంతో ఏమి చేయాలో కూడా అర్థం కాని స్థితిగా ఉంది అని అంటున్నారు. సభలో బాలయ్య చేసిన వ్యాఖ్యల ప్రభావం అంత స్థాయిలో ప్రకంపనలు పుట్టిస్తాయనుకుంటే దానిని రికార్డుల నుంచి తొలగించేవారు అని అంటున్నారు. కానీ అలా జరగలేదు. దాంతో జనసేన టీడీపీల మధ్య కూడా ఒక అగాధం ఏర్పడే స్థితికి వచ్చిందని అంటున్నారు. ఇక బాలయ్య చేసిన వ్యాఖ్యల మీద సీఎం చంద్రబాబు సీరియస్ గానే ఉన్నారు అని అంటున్నారు. కానీ ఇతర ఎమ్మెల్యేల మీద ఆగ్రహించినట్లుగా లేదా క్లాస్ పీకినట్లుగా ఆయన విషయంలో చేయలేకపోతున్నారు అని అంటున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆగ్రహం అంతా ఇతర ఎమ్మెల్యేల మీదకు మళ్ళింది అని అంటున్నారు. నిజానికి ఇతర ఎమ్మెల్యేలు సభలో చేసిన కామెంట్స్ కొంత వరకే. అసలైన డ్యామేజ్ కానీ కూటమి కూసాలు కదిలిపోయేలా హాట్ కామెంట్స్ చేసింది కానీ బాలయ్య అన్నది అందరికీ తెలుసు అని అంటున్నారు. అయితే బాలయ్య విషయంలో గట్టిగానే క్లాస్ పీకాల్సి ఉండగా అది కాస్తా ఎమ్మెల్యేల మీదకు తీవ్ర ఆగ్రహంగా మారింది అని అంటున్నారు. దాంతో అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లుగా తమ మీద అధినాయకత్వం వీరావేశం చూపిస్తోంది అని టీడీపీ తమ్ముళ్ళు కొందరు గుసగుసలు పోతున్నారుట. బాలయ్య విషయం అయితే మొత్తానికి కూటమికి కెలికి వదిలిపెట్టింది అని అంటున్నారు. దాంతోనే మల్లగుల్లాలు పడుతున్న చంద్రబాబు సీరియస్ గా తమ ఎమ్మెల్యేలకు కాషన్ ఇచ్చారు అని అంటున్నారు. తొందరలో టీడీఎల్పీ మీటింగ్ పెట్టి మరీ చాలా మందికి క్లాస్ తీసుకుంటారు అని అంటున్నారు. అయితే అందరి విషయం ఒక ఎత్తు బావమరిది విషయం మరో ఎత్తు అని అంటున్నారు. ఆయన విషయం ఎలా డీల్ చేస్తారు అన్నదే అసలైన చర్చ అని అంటున్నారు.