రాజకీయాల్లో పట్టు విడుపులు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది జనంతో చేసే వ్యవహారం. నిరంతరం సాగే నది లాంటిది రాజకీయం. అందులో ఎన్నో మలుపులు ఉంటాయి. ప్రతీ మలుపూ అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగా ఎన్నో సార్లు ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఒకసారి తాము వెళ్తున్న మార్గంలో ఏమి జరుగుతుంది ఏ వైపు పోవాలి అన్నది ఆలోచించాల్సి ఉంటుంది. అందువల్ల ఒకే రూటూ ఒకే బాటా అంటే పాలిటిక్స్ లో అసలు కుదరదు. అయితే వైసీపీ అధినాయకత్వం విషయంలో మాత్రం పట్టు విడుపులు కంటే పట్టుదలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.
అసెంబ్లీలో రూల్స్ ప్రకారం చూస్తే మొత్తం సభ్యులలో పది శాతం గెలుచుకుంటేనే విపక్ష హోదా దక్కుతుంది. ఆ విధంగా చూస్తే వైసీపీకి 18 మంది సభ్యులు కావాలి. అంటే ఏడుగులు ఎమ్మెల్యేలు కొరత పడ్డారు. అది అందరికీ అర్థం అవుతున్న విషయం. కానీ వైసీపీ ఎందుకో పట్టుదలకు పోతోంది అని అంటున్నారు. ఇదే విధానం 2014, 2019లలో లోక్ సభలోనూ అమలు చేశారు. ఆనాడు ప్రతిపక్ష హోదాకు సరిపడా 55 మంది ఎంపీల బలం కాంగ్రెస్ కి రాలేదు. దాంతో రాహుల్ గాంధీకి విపక్ష హోదా ఇవ్వలేదు. అయినా సరే ఆ పార్టీ లోక్ సభలో పదేళ్ళూ ప్రజా సమస్యల మీద పోరాడింది అని అంతా గుర్తు చేస్తున్నారు.
ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి. సభలో చూస్తే నిబంధనలే అంతా అనుసరిస్తారు. ఇక సభలో విపక్షంగా ఒకే పార్టీ ఉంటే వారికి స్పీకర్ అవకాశాన్ని బట్టి ఎక్కువ సార్లు మైకులు ఇవ్వవచ్చు. సాధారణంగా ఒక సభ్యుడుకి రెండు నిముషాల పాటే మాట్లాడమని స్పీకర్ ఆదేశించినా వారు అయిదారు నిముషాలు పైబడి మాట్లాడిన సందర్భాలూ ఉంటాయి. ప్రజా సమస్యలు ముఖ్యం. అదే విధంగా సభలో ఏ మేరకు జవాబులు రాబట్టామన్నది కూడా కీలకంగా ఉండాల్సి ఉంది. అందువల్ల సమయం ఇస్తే వస్తామని అనడం వరకూ ఓకే కానీ ముందు సభకు వచ్చి తమకు ఎంత మేరకు సమయం ఇస్తున్నారో వైసీపీ అధినాయకత్వం అంచనా వేసుకోవాలి కదా అని అంటున్నారు.
ఇక చట్ట సభల నిబంధనల ప్రకారం చూస్తే కనుక సభ జరిగే పనిదినాలలో వరసగా అరవై రోజుల పాటు ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా గైర్ హాజరు అయితే వారి సభ్యత్వం ఆటోమేటిక్ గా రద్దు అవుతుంది. ఆయా నియోజకవర్గానికి ఉప ఎన్నికను ప్రకటిస్తారు. ఇక చట్ట సభ సభ్యుల అనర్హత మీద తీసుకునే నిర్ణయమే అంతిమంగా ఉంటుంది. అందులో మరే వ్యవస్థ జోక్యం చేసుకోదు. ఈ విధంగా విషయం ఉన్నపుడు వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వం మీదనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఇక ఈ వర్షాకాల సమావేశాలు వైసీపీకి అత్యంత కీలకంగా చూస్తున్నారు. ఎందుకంటే వారు తప్పనిసరిగా హాజరై తమ సభ్యత్వాలను కాపాడుకోవాల్సి ఉంటుంది. లేకపోతే విశేష అధికారాలు కలిగిన అసెంబ్లీ తీసుకునే తీవ్రమైన నిర్ణయం ఎలా ఉంటుందో కూడా ఎవరూ చెప్పలేరని అంటున్నారు. వైసీపీ విషయానికి వస్తే తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని అంటోంది. లేకపోతే ఎందుకు రావడం అని ప్రశ్నిస్తోంది. ఇది టెక్నికల్ ఇష్యూగానే చూడాలని నిపుణుల మాట. అలాగే జనానికి ఇవేమీ పట్టవని తాము ఓటేసి ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు సభకు హాజరవుతున్నారా లేదా అన్నది మాత్రమే వారు పట్టించుకుంటారు అని అంటున్నారు.
ఏపీలో మూకుమ్మడి ఉప ఎన్నికలు వస్తాయా రావా అన్నది జగన్ తీసుకునే నిర్ణయం మీదనే అధారపడి ఉంటుందని అంటున్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాలకు జగన్ ఆయన ఎమ్మెల్యేలు కనుక హాజరైతే అసెంబ్లీలో రాజకీయంగా కొత్త సన్నివేశం ఆవిష్కృతం అవుతుంది. అపుడు అనర్హత వేటు అన్నది పక్కకి పోయి రాజకీయ వేడి రాజుకుంటుంది. అలా కాకుండా సభకు నమస్కారం అన్న విధానంతో కనుక ముందుకు పోతే కనుక సంచలన నిర్ణయాలు ఏపీలో జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఏది జరిగినా జగన్ చేతిలోనే ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.!