ఏపీలో కూటమి రాజకీయాలు నానాటికి బలపడుతున్నాయి. మరో 15 ఏళ్ల పాటు కూటమిగానే ఉంటామంటూ పదపదే చెబుతున్నముఖ్య నేతలు.. తమ మధ్య బంధం ఎంతలా అల్లుకుపోయిందనే విషయంపై కేడర్ కు కూడా స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. రాష్ట్ర ప్రగతి కోసం తాము అన్నిరకాల భేషజాలు వదిలిపెట్టి పరస్పర గౌరవంతో మెలుగుతున్నామని.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, మండల, గ్రామస్థాయి నాయకులు సైతం మిత్రపక్షాలతో సర్దుకుపోవాలని తేల్చిచెబుతున్నారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ చాలా గాఢంగా ఆలింగనం చేసుకున్న ఫొటో వైరల్ అవుతోంది. ఆ ఫొటో చూసిన వారు కూటమిలో చిచ్చు పెట్టడం ఎవరికీ సాధ్యం కాదన్న కామెంట్లు పెడుతున్నారు.
రాజధాని అమరావతిలో శుక్రవారం జాతీయ బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. సుమారు 15 జాతీయ బ్యాంకుల రాష్ట్ర కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏకకాలంలో శంకుస్థాపన చేశారు. అమరావతి సీఆర్డీఏ కార్యాలయం ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మంత్రి నిర్మలమ్మ ముఖ్య అతిథి కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి నారా లోకేశ్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. అయితే కార్యక్రమానికి ముందుగా వచ్చిన పవన్, లోకేశ్ ఒకరినొకరు పలకరించుకోవడమే కాకుండా, చాలా కాలం తర్వాత కలిసిన అన్నదమ్ముల్లా ఆలింగనం చేసుకోవడం ఆకట్టుకుంది. తర్వాత ఇద్దరు చాలా సేపు సరదాగా మాట్లాడుకోవడం చర్చకు దారితీసింది.
పవన్, లోకేశ్ వ్యవహరించిన తీరు చూసిన వారు.. ఆ ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు రోజురోజుకు మరింత ఎక్కువ అవుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల ముందు నుంచే ఈ ఇద్దరి మధ్య చక్కని అనుబంధం కొనసాగుతోందని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే ఇటీవల లోకేశ్ స్పీడు పెంచేశారని, పవన్ ను వెనక్కి నెట్టేశారని విపక్షం వైసీపీ, ఆ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న సోషల్ మీడియా తీవ్రంగా ప్రచారం చేస్తోంది. దీంతో జనసేన పార్టీలో కొంత ఆందోళన, ఆవేదన కనిపించిందని అంటున్నారు.
అయితే ఈ విషయంపై విపక్షంతోపాటు కేడర్ కు స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని ఉభయ నేతలు డిసైడ్ అయ్యారని అంటున్నారు. లోకేశ్, పవన్ ఎక్కడికి వెళ్లినా, ఏ వేదికపై ప్రసంగించినా కూటమి కొనసాగుతుందని, మరో 15 ఏళ్లు తమను ఎవరూ విడదీయలేరనే చెబుతున్నారు. కానీ, ఎక్కడో ఒక చోట,. ఏదో ఒక సందర్భంలో ఆ ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతీసే ప్రచారానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని కూటమి నేతలు అనుమానిస్తున్నారు. దీనివల్ల ఆ ఇద్దరూ తరచూ కలుస్తూ.. తమ బంధాన్ని అందరికీ తెలియజేసేలా సంకేతాలు పంపుతున్నారని అంటున్నారు.












