ఏపీలో చర్చనీయాంశంగా మారిన మద్యం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. దాదాపు రూ.3,200 కోట్ల మేర అవినీతి జరిగిందని, షెల్ కంపెనీల ద్వారా డబ్బు విదేశాలకు తరలించారని ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఈడీ.. కేసు దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో మద్యం స్కాంలో సిట్ పోలీసులు అరెస్టు చేసిన నిందితులను ఈడీ కూడా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.
గత ప్రభుత్వంలో ప్రభుత్వ మద్యం పాలసీని అమలు చేయడంతోపాటు ఎంపిక చేసిన బ్రాండ్లు మాత్రమే విక్రయించేలా చేసి, కమీషన్లు ఇచ్చిన కంపెనీలకే మద్యం ఆర్డర్లు ఇచ్చారని ఈ విధంగా రూ.3,200 కోట్ల విలువైన కుంభకోణానికి పాల్పడ్డారని ప్రభుత్వం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కమీషన్ గా వసూలు చేసిన మొత్తం అంతిమ లబ్ధిదారుకు చేర్చేందుకు నిందితులు మనీలాండరింగ్ చేశారని ఆరోపిస్తూ ఈడీ కేసు నమోదు చేసింది. తన వాదనకు మద్దతుగా ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని అదుపులోకి విచారించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈడీ కేసు ఫైల్ చేయడంతో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని విచారించాల్సివున్నందున అనుమతి ఇవ్వాలని ఈడీ న్యాయవాది జయప్రకాష్ శుక్రవారం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ECIR కాపీ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించడంతో త్వరలో రాజ్ కసిరెడ్డిని ఈడీకి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. మొత్తం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పాత్ర ప్రధానమని సిట్ భావించడంతో ఆయనను ఏ1గా గుర్తించింది. ఈడీ కూడా తన కేసులో రాజ్ కసిరెడ్డిని ఏ1గా పేర్కొనడం చర్చనీయాంశమవుతోంది.
కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో లిక్కర్ స్కాంపై ఈడీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటివరకు లిక్కర్ కేసుతో సంబంధం ఉన్నవారి బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలను ఈడీ పరిశీలించింది. నిందితుల ఆఫీసులు, వ్యాపార సంస్థల కార్యకలాపాల సమాచారం సేకరించింది. కొన్ని అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు సేకరించేందుకు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరుతోందని అంటున్నారు. దీంతో లిక్కర్ స్కాంలో నిందితులు మరిన్ని కష్టాలు ఎదుర్కునే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు