ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఠంచనుగా సాగుతున్నాయి. అవి కూడా బడ్జెట్ సెషన్, రైనీ సెషన్, అలాగే శీతాకాల సమావేశాలు ఇలా మూడు సార్లు కచ్చితంగా నిర్వహిస్తున్నారు. బడ్జెట్ సెషన్ కి ఎక్కువ రోజుల పాటు సభ కార్యకలాపాలు ఉంటాయి. మిగిలినవి వారం నుంచి పది రోజుల పాటు సాగుతాయి. మొత్తం మీద ఏడాదిలో 45 రోజుల పాటు సభను నిర్వహిస్తున్నామని దానిని అరవై రోజుల పాటు పొడిగించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆ మధ్య స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. అయితే సభ జరుగుతున్నపుడు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు హాజరు అయితేనే ప్రజాస్వామ్యానికి ఒక అర్థం, చర్చలు కూడా మరింత అర్ధవంతంగా సాగుతాయి.
ఇక అసెంబ్లీ సమావేశాలు చప్పగా సాగుతున్నాయని అంటున్నారు. హాజరు కూడా పలచగా ఉంటోంది. సభలో కూటమి పార్టీలే ఉన్నాయి ఎంతసేపూ తమ ప్రభుత్వం గురించి బాగానే చెప్పుకుంటారు. అదే సమయంలో విపక్షం మీద గత ప్రభుత్వం అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే అదే సమయంలో విపక్షంగా వైసీపీ ఎమ్మెల్యేలు సీట్లలో ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుందని అంటున్నారు. ఇవతల అధికార పక్షం విమర్శలు చేస్తే దానికి గట్టిగా రిటార్ట్ ఇచ్చేందుకు వైసీపీ సిద్ధంగా ఉన్నపుడే కదా మజా ఉంటుంది అని అంటున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావాలని కూటమి నుంచి పదే పదే విన్నపాలు వస్తున్నాయి. అవి హార్ష్ గా ఉన్నా వాటిలోని మీనింగ్ అదే. తాజాగా సభలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ సభకు రాకుండా ఇంట్లో కూర్చోవడమేంటి అని ఫైర్ అయ్యారు. అంతకు ముందు ఎవరూ అలా చేయలేదని కూడా ఆయన గుర్తు చేశారు. హోదాకు సరిపడా సీట్లు జనాలు ఇవ్వలేదని అన్నారు. సభకు వచ్చి ప్రజా సమస్యల మీద చర్చించాలని అన్నారు. అదే విధంగా తొలి రోజు సభ మొదలైన తరువాత మీడియా పాయింట్ వద్ద అచ్చెన్నాయుడు ఇదే మాట అన్నారు. సభకు రావడానికి విపక్ష హోదాకు సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే సభకు రాకుండా వైసీపీ చేస్తున్న ఈ రకమైన తీరుని పూర్తిగా ఎండగట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రతిపక్ష హోదా అయితే డిమాండ్ చేస్తున్నారు కానీ ప్రజా సమస్యల మీద వారికి శ్రద్ధ నిబద్ధత ఏదీ అని నిలదీశారు. ఇలా అంతా ఏదో ఒక సందర్భంలో జగన్ అసెంబ్లీకి రాకపోవడం మీద ఫైర్ అవుతూనే విపక్షం ఉండాలని కోరుకుంటున్నారు.
ఆఖరికి వైసీపీ అభిమానులు కూడా జగన్ ని అసెంబ్లీకి వెళ్ళమంటున్నారు. జగన్ అన్నా అసెంబ్లీలో కనిపించు అన్నా అని వారు కోరుతున్నారు. మైక్ ఇవ్వకపోతే వాకౌట్ చేయ్ అంతే కానీ సభకు వెళ్ళడం మానొద్దు అని సోషల్ మీడియా ద్వారా వారు విన్నపాలు చేస్తున్నారు. అసెంబ్లీలో తమ అభిమాన నేత జగన్ కనిపించాలని కూడా వారు గట్టిగా కోరుకుంటున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీకి వెళ్దామనే అంటున్నా జగన్ గట్టిగా నిర్ణయం తీసుకోవడంతో ఏమి అనలేని స్థితిలో ఉన్నారని అంటున్నారు.
ఇక వైసీపీ సభకు వస్తే ఒక్కసారిగా సభా కార్యక్రమాల మీద కామన్ మాన్ నుంచి అందరికీ ఆసక్తి పెరుగుతుంది అని అంటున్నారు. అంతే కాదు సభలో హాజరు కూడా బాగా పెరుగుతుందని అంటున్నారు. ఎందుకంటే జగన్ అండ్ కోను అసెంబ్లీలో నిలదీయాలని ప్రతీ కూటమి ఎమ్మెల్యే ఎంతో ఉత్సాహం చూపిస్తారు అని అంటున్నారు అంతే కాదు జగన్ ని తామే గట్టిగా విమర్శించామని చెప్పుకోవడానికి కూడా ఉత్సాహపడతారు. ఇక అధికార పక్షం ప్రతిపక్షం రెండూ ఉంటేనే సభకు అందం. రెండు కళ్ళుగా ఉంటుంది. అయితే వైసీపీ సభకు దూరం కావడంతో అసెంబ్లీ కార్యకలాపాల ఆసక్తి తగ్గుతోంది అని అంటున్నారు.