నటీనటులు కొన్ని పాత్రల కోసం విపరీతంగా శ్రమించడం.. నెలల తరబడి కష్టపడి అవతారం మార్చుకోవడం చేస్తుంటారు. ఇది ఒకెత్తయితే.. ఆ మార్చుకున్న అవతారం నుంచి మళ్లీ మామూలు స్థాయికి రావడానికి శ్రమించడం మరో ఎత్తు. కొన్నిసార్లు అది చాలా రిస్క్‌గా కూడా మారుతుంది. ‘ఐ’ సినిమా టైంలో విక్రమ్ ఇలా ఒక స్థాయికి మించి కష్టపడడడంతో తన ప్రాణాల మీదికి వచ్చింది. ఎలాగోలా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఐతే ఇలా ఓ సినిమా కోసం అనుష్క శెట్టి పడ్డ కష్టం.. చివరికి ఆమె కెరీర్‌ను దెబ్బ తీయడమే కాక, స్వేచ్ఛగా బయటికి కూడా రాలేని పరిస్థితికి తీసుకొచ్చింది. ఆ చిత్రం.. ‘సైజ్ జీరో’ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
‘బాహుబలి: ది బిగినింగ్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ తర్వాత అనుష్క చేసిన చిత్రమిది. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించాడు. ఒక భారీ కాయురాలు ప్రేమ, పెళ్లి కోసం పడే పాట్ల చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. మామూలుగా ఆర్టిస్టులు ఇలాంటి పాత్రలు చేసేటపుడు ప్రోస్థెటిక్ మేకప్ ట్రై చేస్తారు. కానీ అనుష్క మాత్రం రియల్‌గానే బరువు పెరిగి, తగ్గాలనుకుంది. ఆ ఆలోచనే ఆమెకు తీరని నష్టం చేసింది. బరువు అయితే పెరిగింది కానీ.. తిరిగి మామూలు స్థితికి రాలేకపోయింది.
ఏళ్ల తరబడి ఎన్నో ప్రయత్నాలు చేసిన పూర్వపు రూపంలోకి రాలేకపోయింది. ఇది ఆమె ఆరోగ్యం మీద కూడా కొంత ప్రతికూల ప్రభావం చూపించి, లుక్ మారిపోయింది. ఈ దెబ్బకు ‘బాహుబలి: ది కంక్లూజన్’ లాంటి భారీ చిత్రానికి కూడా ఇబ్బందిగా మారింది. అనుష్కతో తీసిన సన్నివేశాల్లో ఆమెను మునుపటి లుక్‌లో చూపించడం కోసం గ్రాఫిక్స్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక అనుష్క తర్వాత చేసిన నిశ్శబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాల్లో కూడా అనుష్క లుక్ సహజంగా కనిపించలేదు. వీటి ప్రమోషన్లలో ఆమె పాల్గొనలేదు.
ఇక వర్తమానంలోకి వస్తే.. ‘ఘాటి’ సినిమాలో అనుష్కను చూసిన అభిమానులు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. ఆమె లుక్ అంత అసహజంగా కనిపించింది అందులో. వేర్వేరు సీన్లలో వేర్వేరు రకాలుగా దర్శనమిచ్చింది అనుష్క. చాలా చోట్ల గ్రాఫిక్స్ వాడినట్లు స్పష్టంగా కనిపించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్లకు కూడా అనుష్క హాజరు కాలేని పరిస్థితి. కేవలం ఆడియో ఇంటర్వ్యూలు మాత్రమే చేసింది. అనుష్క ఏమీ నయనతారలా ప్రమోషన్లకు దూరం అని కండిషన్లు పెట్టే రకం కాదు.
తన ఒరిజినల్ లుక్‌ను ఆమె బయట చూపించలేని స్థితిలోనే ప్రమోషన్లకు రాలేకపోయిందనే భావిస్తున్నారు. తన లుక్ మారిపోవడం ఇటు సినిమాకూ ఇబ్బందిగా మారుతోంది. అటు ప్రమోషన్ల పరంగానూ సమస్య అవుతోంది. ‘సైజ్ జీరో’ శాపం ఆమెను ఇప్పటికీ వెంటాడుతోందన్నది స్పష్టం. ‘ఘాటి’ అనుభవం తర్వాత అనుష్కతో మళ్లీ ఇంకో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు భయపడే పరిస్థితి కనిపిస్తోంది.