రిలయన్స్ అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఊహించని విధంగా ఆయనకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రిలయన్స్ కమ్యూనికేషన్ కు సంబంధించి ఎస్బిఐ బ్యాంకులో రుణం తీసుకుని వాటిని ఇతర సంస్థలకు మళ్లించినట్లు ఆయన పైన, రిలయన్స్ కమ్యూనికేషన్ సంస్థను ఎస్బిఐ ఫ్రాడ్ కింద తేల్చడంతో ఆయనకు ఒక్కొక్కటిగా ఉచ్చు బిగుస్తోంది.
దాదాపు 17 వేల కోట్ల రూపాయల విలువైన ఋణ మోసాలకు సంబంధించిన కేసులో తాజాగా అనిల్ అంబానీకి లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు రుణాలకు సంబంధించి అనిల్ అంబానీ మోసం చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయగా, ఈ క్రమంలో ఆయన దేశం విడిచి పారిపోయే అవకాశం ఉన్నందున తాజాగా లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి.
ఆగస్టు 5వ తేదీన అనిల్ అంబానీ విచారణకు హాజరు కావలసి ఉంది. ఈ క్రమంలోనే ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఈడీ చేసిన విజ్ఞప్తి మేరకు అనిల్ అంబానీ కి లుకౌట్ నోటీసులను జారీ చేశారు. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అనిల్ అంబానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరు కావలసి ఉంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన వాంగ్మూలాన్ని ఈడి నమోదు చేయనుంది.
ఇదే సమయంలో రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్ లకు కూడా, ఇదే కేసులో త్వరలోనే నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. జూలై 24వ తేదీ నుంచి అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీలు, ఆస్తులపైనా ఈడి సోదాలు నిర్వహించింది. ముంబై, ఢిల్లీలోని 35 ప్రాంతాలలో రిలయన్స్ గ్రూప్ కు చెందిన దాదాపు 50కంపెనీలు, 25 మంది వ్యక్తులపైన ఈడి సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.
17 వేలకోట్ల నిధులను అక్రమంగా ఇతర షెల్ కంపెనీలకు మళ్లించిన ఆరోపణలు
ఆపై అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసింది. రిలయన్స్ ఇన్ఫ్రా తో సహా అనిల్ అంబానీ కి చెందిన పలు కంపెనీలు మొత్తం 17 వేలకోట్ల నిధులను అక్రమంగా ఇతర షెల్ కంపెనీలకు తరలించినట్టు ఆరోపణల నేపథ్యంలో ఈ డి ఈ సోదాలు నిర్వహించింది. అనిల్ అంబానీ ముఖ్యంగా ఎస్ బ్యాంక్ అధికారులతో కుమ్మకై మూడువేల కోట్ల లోన్ పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు ఎస్బిఐ తమ బ్యాంకు నుండి లోన్ తీసుకుని వేరే కంపెనీలకు మళ్లించినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని రిలయన్స్ కమ్యూనికేషన్ ను ఫ్రాడ్ గా ప్రకటించింది. ఇక ఈ క్రమంలో అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీల షేర్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. ప్రస్తుతం ఈడి దాడులతో పాటు, సమన్లు జారీ చేయడంతో అనిల్ అంబానీ కి సంబంధించిన కంపెనీల షేర్ల ధరలు మరింత పతనం దిశగా వెళుతున్నాయి.