అనీత్ పద్దా .. ఇటీవల గూగుల్ ట్రెండింగ్‌లో ఉన్న పేరు ఇది. నటించిన తొలి సినిమాతోనే ఓవర్ నైట్ సెన్సేషన్ గా అవతరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా యువతరం హృదయాల్లో గిలిగింతలు పెడుతోంది. అద్భుతమైన అందం, దానికి మించిన అభినయంతో ఈ భామ కుర్రకారులో గుబులు రేపుతోంది.
అనీత్ పద్దా- అహాన్ పాండే జంటగా మోహిత్ సూరి తెరకెక్కించిన `సయ్యారా` బాక్సాఫీస్ వద్ద హవా సాగిస్తూ 300 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టడానికి ఇంచి దూరంలో మాత్రమే ఉంది. ఇప్పటికే దాదాపు రూ. కేవలం 15 రోజుల్లో 297 కోట్ల నికర వసూళ్లను సాధించిందని ట్రేడ్ చెబుతోంది. డే -16 ఈ ప్రేమకథా చిత్రం చరిత్ర పుటల్లోకి ఎక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమా దిగ్గజ హీరోల సినిమాల రికార్డులను వేటాడుతోంది. సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్, బజరంగీ భాయిజాన్ , టైగర్ జిందా హై రికార్డులకు చేరువవుతోంది. ఇటీవలే షాహిద్ నటించిన కబీర్ సింగ్, దీపిక పదుకొనే నటించిన పద్మావత్, హృతిక్ నటించిన వార్, విక్కీ కౌశల్ నటించిన ఊరి రికార్డులను కూడా తిరగరాసింది.
ప్రొఫైల్‌లో భవిష్యత్ లక్ష్యాలు:
ఓవైపు సయ్యారా రికార్డుల గురించి చర్చిస్తుండగానే, మరోవైపు నవతరం నటీనటులు అహాన్ పాండే, అనీత్ గురించిన ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పుడు అనీత్ పద్దా లింక్డ్ఇన్ ప్రొఫైల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. లింక్‌డ్ ఇన్‌లో అనీత్ తన విద్యాభ్యాసం సహా భవిష్యత్ లక్ష్యాల గురించి ప్రస్థావించడం ఆసక్తిని కలిగించింది.
జాబ్స్ రిక్రూట్ చేస్తాను:
లింక్‌డ్ ఇన్ ప్రొఫైల్ లో ఇలా రాసి ఉంది. ”నేను ప్రస్తుతం జీసస్ అండ్ మేరీ కాలేజీలో మూడవ సంవత్సరం విద్యార్థిని.. పొలిటికల్ సైన్స్, ఇంగ్లీషులో స్టడీ కొనసాగుతోంది. స్టడీస్‌తో పాటు, నేను చిత్ర పరిశ్రమలో సమాంతర ప్రయాణాన్ని ప్రారంభించాను” అని రాసింది. వ్యక్తిగత అభివృద్ధికి సాధనంగా విద్య ప్రాముఖ్యతను విశ్లేషిస్తూనే, నటనపై నా మక్కువ పెంచుకోవడం మంచి ఫలితాన్నిచ్చిందని కూడా అనీత్ తెలిపింది. అంతేకాదు హెచ్.ఆర్ గా పని చేస్తూ జాబ్ రిక్రూట్ మెంట్స్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని అనీత్ తెలిపారు. సినీపరిశ్రమలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు నన్ను సవాల్ చేసే అమ్మాయిగా సన్నద్దం చేసారని కూడా ఇందులో ఆనందం వ్యక్తం చేసారు. ఇంటర్న్ షిప్‌లు, పరిశోధనలో వృద్ధితో మరింత ముందుకు సాగుతాను. అర్థవంతమైన సానుకూల మార్పును కొనసాగిస్తానని అనీత్ రాసారు.
మరో మూడేళ్లు చాలా జాగ్రత్త:
అనీత్ లింక్ డ్ ఇన్ ప్రొఫైల్ చూశాక.. ఒక సాధారణ అమ్మాయి ఇలాంటి అసాధారణ విజయాన్ని కలలో కూడా ఊహించి ఉండదని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అనీత్ పద్దా దేశవ్యాప్తంగా ఉన్న యువతరం కలల రాణిగా మారింది. ఎందరికో స్ఫూర్తిని నింపుతోంది. తెలివైన వారు కష్టపడి పని చేసేవారే ఇక్కడి వరకూ వస్తారు. మీలాగా నటనలోకి రాకపోయి ఉంటే, వేరే రంగాలలో ఎదిగిన వారు ఇక్కడ ఉంటారు అని కూడా కొందరు లింక్ డ్ ఇన్ ప్రొఫైల్ పై వ్యాఖ్యానించారు. అనీత్ కి ఇంకా మంచి పాత్రలు లభించాలని, రాబోయే మూడు సంవత్సరాలు అత్యంత కీలకమని కొందరు వ్యాఖ్యానించారు.