ఏపీలోని చాలా వరకు నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీకి నాయకులు లేరా? ఉన్నవారు కూడా సైలెంట్ అయ్యారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఒకరకంగా ఉంటే.. ప్రతిపక్షం తరఫున నాయకులు లేని నియోజకవర్గాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. అంటే.. ఇక్కడ వాయిస్ వినిపించే వారు.. అధికార పక్షాన్ని ప్రశ్నించే వారు కూడా లేకుండా పోతున్నారు. ఫలితంగా ప్రజలకు ఇప్పుడు అధికార పార్టీ నాయకులే కనిపిస్తున్నారు.
అయితే.. ఇలాంటి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని.. ఎమ్మెల్యేలు మరింత సుస్థిరమైన ప్రజా భిమానాన్నిపొందే అవకాశం ఉంటుంది. కానీ, ఆ తరహాలో కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేయడం లేదన్నది అందరికీ తెలిసిందే. ఇక, ఎమ్మెల్యేలకు తిరుగులేని నియోజకవర్గాలుగా.. సుమారు 50కి పైగా ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో కీలకమైన నియోజకవర్గాలు.. కుప్పం, పెనుకొండ, విజయవాడ సెంట్రల్,శింగనమల, మైలవరం, గుంటూరు వెస్ట్, పొన్నూరు, తాడికొండ, విజయవాడ వెస్టు సహా.. అనేకం ఉన్నా యి.
ఆయా నియోజకవర్గాల్లో అధికార పక్షానిదే తిరుగులేని ఆధిపత్యంగా కనిపిస్తోంది. విజయవాడ సెంట్రల్‌లో వైసీపీకి నాయకుడు ఉన్నా.. ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించలేదు. దీంతో మల్లాది విష్ణు ఎక్కడా ఎవరికి కనిపించడం లేదు. ప్రజల తరఫున ప్రశ్నించడం కూడా లేదు. పైగా .. తనకున్న మద్యం వ్యాపా రాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇక, కుప్పంలో వైసీపీ ఎప్పుడో చేతులు ఎత్తేసింది. అలానే గుంటూరు వెస్టులో వైసీపీ అన్న మాటే లేకుండా పోయింది.
ఇలానే ఇతర నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికల్లో అభ్యర్థులను మార్చ డం.. కొత్తవారికి అవకాశం ఇవ్వడం వంటి ప్రయోగాలు జరిగాయి. రాజకీయాల్లో ప్రయోగాలు కొంత వరకు మంచిదే అయినా.. పూర్తిగా ప్రయోగాలపైనే ఆధారపడిన ఫలితంగా.. వైసీపీ నిర్వీర్యం అయింది. ఇప్పటి కిప్పుడు మేల్కొని.. కొత్తవారికి లేదా.. బలమైన నాయకులకు అవకాశం ఇచ్చినా.. వారు లైన్‌లో పడేందుకు రెండేళ్ల సమయం పడుతుంది. కానీ.. ఆ దిశగా పార్టీ ఇప్పటి వరకు చర్యలు చేపట్టిందే లేదు. సో.. ఈ పరిణామాలతో 50కిపైగా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకులకు తిరుగులేకుండా పోయిందన్నది వాస్తవం.