రాజకీయంగా నిరంతరం.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను టార్గెట్ చేసే సీఎం చంద్రబాబు.. తాజాగా ఆయన తీసుకున్న ఓ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేశారు. ఇది కొంత చిత్రంగా ఉన్నప్పటికీ.. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని.. రాజకీయాలకు అతీతంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి జగన్ తీసుకున్న నిర్ణయాల్లో మంచి ఉన్నాయని భావిస్తే.. చంద్రబాబు భేషజాలకు పోకుండా వాటిని అనుమతిస్తున్నారు. ఇప్పుడే కాదు.. గత ఆరు మాసాల నుంచి కొన్ని కొన్ని నిర్ణయాలు ఇలానే ఉన్నాయి.
తాజాగా తీసుకున్న నిర్ణయానికి వస్తే.. రాష్ట్రం వైసీపీ హయాంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త.. ‘గౌతం అదానీ ‘కి సంబంధించిన సోలార్ పవర్ ప్రాజెక్టులకు.. అప్పటి సీఎం జగన్ ఆమోద ముద్ర వేశారు.అదానీ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు కూడా ఒప్పందాలు చేసుకున్నారు. ఈ క్రమంలో సీమలో సోరాల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు భూములు కేటాయిస్తూ.. చివరి మంత్రివర్గంలో జగన్ ప్రతిపాదించారు. అయితే.. అది కార్యరూపం దాల్చేసరికి.. ఎన్నికలు రావడంతో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనిని పక్కన పెట్టారు.
తాజాగా దీనిపై అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేసిన సీఎం చంద్రబాబు, రాష్ట్ర భవిష్యత్తు, పెట్టుబడులు, సోలార్ విద్యుత్‌కు ఉన్న ప్రాధాన్యం వంటివి దృష్టిలో పెట్టుకుని.. భేషజాలకు పోకుండా.. నాటి జగన్ నిర్ణయాన్ని యథాతథంగా ఆమోదించారు. దీని ప్రకారం.. కడప మైలవరంలో 250 మెగా వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో అదానీ సోలార్ ఎనర్జీకి 200.05 ఎకరాలు కేటాయించేందుకు కూడా మంత్రి వర్గం పచ్చ జెండా ఊపింది. తద్వారా రాష్ట్రంలో 2 వేల మంది యువతకు ఉపాధి, సీమకు.. సౌర వెలుగులు లభించనున్నాయి.
ఇక, ఇప్పటి వరకు కూడా.. జగన్ తీసుకున్న పలు నిర్ణయాలను సీఎం చంద్రబాబు ఎలాంటి రాజకీయాల కు ప్రాధాన్యం ఇవ్వకుండా అమలు చేస్తున్నారు. దీనిలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిబం ధనలను పూర్తిగా వైసీపీ అనుసరించిన అమ్మ ఒడి నిబంధనలనే అమలు చేస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు విషయంలోనూ జగన్ తెచ్చిన నిబంధనలే కొనసాగిస్తున్నారు. అలానే.. కొన్నింటికి పేరు మార్చినా.. వాటిని కూడా యథాతథంగా కొనసాగిస్తున్నారు.