అధికార టీడీపీలోకి వలసలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అధికారంలోకి వచ్చిన కొత్తలో విపక్ష వైసీపీ నుంచి భారీగా చేరికలను ప్రోత్సహించిన టీడీపీ.. కొంతకాలంగా ఆ ప్రక్రియకు ఫుల్ స్టాప్ పెట్టింది. అధికారం పోవడంతోనే వైసీపీ రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు చాలా మంది టీడీపీలో చేరికకు ప్రయత్నించారు. వీరిలో కొందరిని చేర్చుకున్న టీడీపీ అధిష్టానం నియోజకవర్గాల్లో నేతల అభ్యంతరాలతో చేరికల ప్రక్రియను కొంతకాలంగా కోల్డ్ స్టోరీజ్ లో పెట్టింది. ఇక స్థానిక ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో వైసీపీని పూర్తిస్థాయిలో దెబ్బకొట్టేందుకు మళ్లీ పార్టీ మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్సీలు ఈ రోజు సాయంత్రమే పసుపు కండువాలు కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ తరఫున ఎమ్మెల్సీలుగా గెలిచిన మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణచక్రవర్తి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు చెబుతున్నారు. వీరు ముగ్గురు చాలా కాలం క్రితమే వైసీపీకి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసేశారు. అయితే మండలి చైర్మన్ మోషేన్ రాజు మాత్రం ఈ రాజీనామాలను ఆమోదించలేదు. దీంతో ఇంతవరకు వీరి చేరిక ఆలస్యమైందని అంటున్నారు.
పదవులకు రాజీనామా చేసి వారినే పార్టీలో చేర్చుకోవాలని టీడీపీ భావించడంతో ఎమ్మెల్సీల చేరిక ఆలస్యమైందని అంటున్నారు. అయితే మండలి చైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోడానికి సమయం తీసుకుంటుండటంతో ఈ వర్షాకాల సమావేశాల్లో ఎమ్మెల్సీలకు పసుపు కండువాలు కప్పి, పార్టీలో చేర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని చెబుతున్నారు. మండలిలో ప్రస్తుతానికి వైసీపీకే ఆధిక్యం ఉన్నప్పటికీ దాదాపు ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేయడంతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. వచ్చే ఏడాది భారీగా రిటైర్మెంట్లు ఉండటం, రాజీనామా చేసిన వారి స్థానంలో కొత్తగా ఎన్నిక నిర్వహిస్తే టీడీపీ గెలుచుకునే అవకాశం ఉండటంతో రాజీనామాలు ఆమోదించకుండా ఇంతకాలం మండలి చైర్మనుపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు.
అయితే స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటం వల్ల క్షేత్రస్థాయిలో సానుకూల వాతావరణం ఏర్పడే వ్యూహంలో భాగంగా ఎమ్మెల్సీలను తక్షణం పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రాజశేఖర్ చేరికతో చిలకలూరిపేట నియోజకవర్గంతోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదేవిధంగా కర్రి పద్మశ్రీ చేరకతో గోదావరి జిల్లాల్లోను.. కల్యాణ్ చక్రవర్తి కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని చెబుతున్నారు. మరోవైపు వైసీపీకి రాజీనామా చేసిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు టీడీపీలో చేరనుండగా, ఒకరు ఇప్పటికే బీజేపీ గూటికి చేరారు. అదేవిధంగా ఏలూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ జనసేన కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.