కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు గ్రాఫ్ బాగుందని.. ప్రజలు మెచ్చుకుంటు న్నారని, వైసీపీ హయాంలో కంటే ఇప్పుడు సంక్షేమాన్ని మరింత జోరుగా అమలు చేస్తున్నామని.. టీడీపీ నాయకులు సహా.. అధినేత, సీఎం చంద్రబాబు కూడా చెబుతున్నారు. మంచిదే. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కొట్టడమే కావాల్సింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం.. తద్వారా.. వచ్చే ఎన్నికలకు బాటలు వేసుకోవడం మంచిదే. ఏ పార్టీలో అయినా.. ప్రభుత్వాలకు కావాల్సింది ఇదే.
కానీ.. ఇక్కడే లెక్కలు తప్పుతున్నాయి. అంచనాలకు మించి పోతున్నాయి. ఆర్థిక శాఖ వర్గాలు.. తాజాగా ప్రభుత్వానికి సమర్పించిన లెక్కలు గమనిస్తే.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జె ట్లో అంచనాలకు మించిన ఖర్చులు నమోదు అవుతుండడాన్ని వారు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి తల్లికి వందనం పథకానికి బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం.. 6 వేల కోట్ల పైచిలుకు. కానీ, అమల్లోకి వచ్చే సరికి.. ఇది మరో రెండు వేల కోట్లకు దాటిపోయింది. దీనిని సమకూర్చడం ఇబ్బందిగా మారింది.
ఇక, తాజాగా ప్రవేశ పెట్టిన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం.. కూడా ముందుగా వేసుకున్న అంచనాల ప్రకారం.. 1900 కోట్ల రూపాయలకు అటు-ఇటు. అయితే.. తాజాగా పెరిగిపోయిన మహిళల సంఖ్యతో పోల్చుకుంటే.. రోజుకు 300 కోట్ల రూపాయలు అనుకున్నది కాస్తా.. 60-70 కోట్ల రూపాయలకు పైగా ఎగబాకింది. అలానే.. అన్నదాత సుఖీభవ పథకం కూడా.. ఇలానే ఉంది. దీంతో లెక్కలు తప్పుతున్నాయ ని పేర్కొంటూ.. ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి ముందుగానే కేటాయించిన సొమ్ముల కోసం నానా ప్రయాస పడాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు దానిని కూడా మించిపోయిన దరిమిలా.. ఇప్పుడు కింకర్తవ్యం? అనే పరిస్థితికి వచ్చింది. పైగా .. అన్ని పథకాల్లోనూ.. ఇంకా పెండింగు దరఖాస్తులు నిలిచిపోయాయి. తల్లికి వందనం పథకంలో జిల్లాల వారీగా 1000 కి పైగా దరఖాస్తులు క్లియర్ చేయాల్సి ఉందని కలెక్టర్లు చెబుతున్నారు. అన్నదాతలోనూ అలానే ఉన్నాయి. దీంతో వీటిని క్లియర్ చేయడమా..? లేక, పెండింగులో నే ఉంచడమా? అనే విషయంపై తేల్చాల్సి ఉంది. ఇదే సమయంలో ఖర్చులు తగ్గించేందుకు కూడా ప్రయత్నం చేయాలని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.