ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయంగా అత్యంత సీనియర్. ఇందులో రెండవ మాటకు తావు లేదు. అదే విధంగా ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఏపీలో రెండు సార్లు విభజన ఏపీలో మరో రెండు సార్లు కలుపుకుని బాబు ఈ రికార్డు సాధించారు. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే బాబు ఎపుడూ వరసగా గెలిచింది లేదు. ఆయన ఒకసారి సీఎం అయితే మరుసటి ఎన్నికల్లో ఓటమి పాలు అవుతూ వచ్చారు. ఉమ్మడి ఏపీలో అయితే రెండు సార్లు ఓటమి వరించింది. దీనినే ప్రత్యర్ధులు విమర్శిస్తూంటారు.
ఇక తెలుగు నాట వరసగా రెండు సార్లు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రులు అయిన వారి హిస్టరీ చూస్తే ఎన్టీఆర్ వైఎస్సార్, కేసీఆర్ కనిపిస్తారు. 1983లో ఎన్టీఆర్ తొలిసారి సీఎం అయ్యారు. నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ తరువాత ఆయన 1984లో అసెంబ్లీని రద్దు చేసి 1985లో ఎన్నికలకు వెళ్ళారు. ఆ ఎన్నికల్లోనూ బ్రహ్మాండమైన మెజారిటీ సాధించి మళ్ళీ సీఎం అయ్యారు. ఇక వైఎస్సార్ 2004లో మొదటిసారి సీఎం అయ్యారు. 2009లో అధికారంలో ఉంటూనే ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ సీఎం అయ్యారు. కేసీఆర్ విషయం తీసుకున్నా 2014, 2018లలో వరసగా సీఎం గా ప్రమాణం చేశారు. హ్యాట్రిక్ సీఎం కావాలనుకున్న ఆయన ఆశలు 2023లో తీరలేదు అదే జరిగితే తెలుగు నాట వరసగా మూడు సార్లు గెలిచిన సీఎం గా కేసీఆర్ చరిత్రకెక్కేవారు.
ఇక చూసుకుంటే ఉమ్మడి ఏపీలో టీడీపీ పుట్టాక ఒక రాజకీయ పార్టీకి రెండు సార్లు అధికారంలో కొనసాగేందుకు చాన్స్ ఇస్తూ వచ్చారు. 1983, 1985లలో తెలుగుదేశం, 1995, 1999లలో మళ్ళీ తెలుగుదేశం పార్టీలకు పట్టం కట్టారు. ఇక 2004, 2009లలో కాంగ్రెస్ ని జనాలు గెలిపించారు 2014, 2018లో బీఆర్ఎస్ ని గెలిపించారు 2023లో కాంగ్రెస్ ని గెలిపించారు. 2028లో మరో చాన్స్ మాదే అని ఈ ట్రాక్ రికార్డు చూసి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇక విభజన ఏపీలో మాత్రం 2014లో టీడీపీ, 2019లో వైసీపీ, 2024లో టీడీపీ కూటమి గెలిచాయి. 2029లో లెక్క ప్రకారం అయితే వైసీపీ గెలవాలి. తమ పార్టీయే గెలుస్తుంది అని ఇప్పటికే వైసీపీ నాయకులు పదే పదే చెబుతూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి చెబుతున్న ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే తమదే చాన్స్ అని కూడా భావిస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశంలో దీని మీద మధనం జరుగుతోంది.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే దీని మీదనే డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు ఆయన 2024 ఎన్నికల్లో గెలిచిన తరువాత నుంచి జనాలకు పలు సభలలో ఇదే విషయం చెబుతున్నారు. రాజకీయాల్లో వైకుంఠపాళి ఆడవద్దని కోరుతున్నారు. ఒక పార్టీకి స్థిరంగా అధికారం ఇస్తే అభివృద్ధి ఏమిటి అన్నది చూస్తారు అని ఆయన చెబుతున్నారు. ఇందుకు దేశంలోని అనేక పార్టీలు వరసగా గెలిచిన ఉదంతాలను సైతం ఉదహరిస్తున్నారు తాజాగా ఆటో డ్రైవర్ల సేవలో పధకం ప్రారంభం సందర్భంగా ఆయన జనాలకు దీని మీదనే దిశా నిర్దేశం చేశారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని భావించి ఓటు మళ్ళించొద్దు అని కూడా సూచించారు.
ఇక్కడ చూస్తే తమిళనాడు రాజకీయం నడుస్తోంది. ఒక ఎన్నికలో ఒక పార్టీని గెలిపిస్తున్న జనాలు మరో ఎన్నికలో ఇంకో పార్టీని గెలిపిస్తున్నారు. ఏపీలో అయితే ఈసారి జనాలు బ్రేకు చేస్తారా లేక ట్రాక్ తప్పకుండా తమ సహజ లక్షణాలు చాటుకుంటారా అన్నది చర్చగా ఉంది. ట్రాక్ తప్పకపోతే వైసీపీ అధికారంలోకి వస్తుంది అని అంటున్నారు. అలా కాకుండా మరోసారి టీడీపీ వస్తే మాత్రం చంద్రబాబు కూడా వరసగా రెండు ఎన్నికల్లో గెలిచిన హిస్టరీని సొంతం చేసుకున్న వారు అవుతారు. అయితే ఏపీ ఓటర్లలో రాజకీయ చైతన్యం ఎక్కువ. అంతే కాదు ప్రతీ ఎన్నికకూ వారు తమ విలక్షణతను చాటుకుంటూంటారు. అంతే కాదు కొన్ని కీలక ఓటు బ్యాంకులుగా ఉన్న వర్గాలు సైతం మార్పుని అయిదేళ్ళకు ఒక మారు కోరుకుంటూ వస్తున్నారు. మరి వారి ఆలోచనల్లో తేడా వస్తే తప్ప ఈ ట్రాక్ నుంచి మళ్ళించడం సాధ్యం కాదని తలపండిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి 2029లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుందో.