ముఖ్యమంత్రి ముందు ఉప ముఖ్యమంత్రి తరువాత. ఇలా ఒకరి తరువాత ఒకరు అక్కడికి వస్తున్నారు. ఒకరిది అధికార కార్యక్రమం మరొకరిది పార్టీ కార్యక్రమం. ఇలా ఇద్దరూ దాదాపుగా ఒకే సమయంలో రావడంతో రాజకీయ సందడి విశాఖలో అంతా ఇంతా కాదు. విశాఖ అంటేనే కూటమికి బలమైన ప్రాంతం. దాంతో పాటు తరచుగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వస్తూనే ఉంటారు. మధ్యలో నారా లోకేష్ కూడా వస్తూంటారు. దాంతో కూటమి త్రిమూర్తుల ఫుల్ ఫోకస్ మెగా సిటీ మీద పెట్టినట్లు అవుతోంది.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే ఆయన కీలక కార్యక్రమం కోసమే వస్తున్నారు. జాతీయ క్రీడల దినోత్సవం ఈ నెల 29న విశాఖ వేదికగా నిర్వహించనున్నారు. దానికి ముఖ్య అతిధిగా చంద్రబాబు హాజరవుతున్నారు విశాఖ నుంచే క్రీడా సందేశాన్ని ఆయన ఇవ్వనున్నారు. క్రీడా పాలసీని కూడా ఆయన వెల్లడిస్తారు అని అంటున్నారు. అంతే కాకుండా ఏపీ వ్యాప్తంగా క్రీడా ప్రాంగణాలను నిర్మించడానికి కూడా విశాఖ నుంచి కీలక ప్రకటన చేస్తారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక క్రీడా స్టేడియంని నిర్మించాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గత కొద్ది రోజులుగా రాష్ట్ర జిల్లా స్థాయిలలో నిర్వహించిన పోటీలలో విజేతలకు ముఖ్యమంత్రి బహుమతి ప్రదానం చేయనున్నారు
మరో వైపు ఈ నెల 30న జనసేన ఉత్తరాంధ్ర మీట్ ఉంది. విశాఖలో నిర్వహించే ఈ భారీ సమావేశంలో పాల్గొనడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖకు వస్తున్నారు. ఆయన ముందు రోజే విశాఖ చేరుకుంటారు అని అంటున్నారు. దాంతో బాబు పవన్ విశాఖలో ఒకే సమయంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి జనసేన ఉత్తరాంధ్ర పార్టీ క్యాడర్ కి దిశా నిర్దేశం చేయడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని ఉత్తరాంధ్రలో బలోపేతం చేయడానికి ఈ సమావేశం దిశా నిర్దేశం చేస్తుందని అంటున్నారు. అంతే కాకుండా క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితులను తెలుసుకోవడం క్యాడర్ ని పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇవ్వడం కూడా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం గా చెబుతున్నారు. కూటమి పార్టీలను కో ఆర్డినేట్ చేసుకుంటూనే జనసేన తానుగా బలపడడానికి అవసరమైన నిర్మాణాత్మకమైన సూచనలు అధినాయకత్వం ఇస్తుందని అంటున్నారు. అంతే కాకుండా పార్టీలో అసంతృప్తులు లేకుండా చూస్తూ అందరినీ ఒక్క త్రాటి మీద నడిపించేందుకు ఈ సమావేశాన్ని వేదికగా చేసుకుంటారు అని అంటున్నారు. ఈ విధంగా చంద్రబాబు పవన్ ల రాకతో విశాఖలో రాజకీయ సందడి పీక్స్ కి చేరుతుందని అంటున్నారు.