ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో 13 జిల్లాలు ఉండగా, గత వైసీపీ ప్రభుత్వం 26 జిల్లాలకు పెంచింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా గుర్తించడంతోపాటు కొద్దిపాటి మార్పులు చేసింది. అదేవిధంగా అరకు పార్లమెంటు స్థానాన్ని రెండుగా జిల్లాలుగా ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ చేపట్టిన జిల్లాల విభజనలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయాయి. కొన్ని జిల్లా పేర్లు మార్చాలనే డిమాండుతోపాటు జిల్లా సరిహద్దులు మార్పు, జిల్లా కేంద్రాల మార్పు వంటి అంశాలపై ప్రభుత్వానికి సూచనలు అందాయి. కానీ, అప్పటి ప్రభుత్వం ఈ సూచనలను పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఎన్నికల సమయంలో ప్రజల సౌలభ్యం మేరకు జిల్లాలను విభజిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించి జిల్లాలపై సూచనలు ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం కోరింది.
ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్,మున్సిపల్ మంత్రి నారాయణ, హోంమంత్రి వంగలపూడి అనిత, రోడ్లు, భవనాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జలవనరుల మంత్రి రామానాయుడు, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తో ఉప సంఘం ఏర్పాటైంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ బృందానికి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. మంత్రుల కమిటీ విధి విధానాలను జీవోలో స్పష్టంగా తెలిపారు.
ప్రభుత్వ సూచనలతో ప్రస్తుతం ఉన్న జిల్లాలు, వాటి పేర్లు, సరిహద్దులపై మంత్రుల కమిటీ సూచనలు చేయాల్సివుంది. ప్రాంతీయ ప్రాధాన్యతలు, చారిత్రక విశేషాలు ఆధారంగా జిల్లాల పేర్లు మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా ప్రభుత్వం మార్చింది. అదేవిధంగా రాష్ట్రంలోని మిగతా జిల్లాల పేర్లపై ఏవైనా సూచనలు వస్తే వాటిని పరిశీలించనుందని సమాచారం. గతంలో 26 జిల్లాలుగా ఏర్పాటు చేసిన సమయంలో కొన్ని చోట్ల ప్రజలు ఉద్యమాలు చేపట్టారు. జిల్లా కేంద్రాలను మార్చాలని, తమ మండలాన్ని పట్టణాన్ని మరో జిల్లాలో కలపాలని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే అప్పటి ప్రభుత్వం ఇలాంటి అభ్యంతరాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో విజయవాడ నగరంలోని భాగమైన పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలు కృష్ణా జిల్లాకు వెళ్లాయి. అదేవిధంగా విశాఖ నగరానికి సమీపంగా ఉన్న కొత్తవలస మండలం విజయనగరం జిల్లాలో కలిసింది. ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని సమస్యలు ఉన్నాయని అంటున్నారు. మంత్రుల కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యలను గుర్తించి పరిష్కారాలను ప్రభుత్వానికి సూచించనుంది.