ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. మూడు పార్టీలు కూటమిగా కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకోవటం పైన వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కూటమిలో బీజేపీ పట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎనిమిది మంది అసెంబ్లీ సభ్యులు ఉన్న బీజేపీ రెండు రాజ్యసభ స్థానాలు దక్కించుకుంది. కాగా, ఇప్పుడు ఏపీ మంత్రివర్గ విస్తరణకు కసరత్తు జరుగుతోంది. మెగా బ్రదర్ నాగబాబు తో పాటుగా బీజేపీకి మరో మంత్రి పదవి.. టీడీపీ నుంచి ఇద్దరికి ఛాన్స్ దక్కనున్న ట్లు తెలుస్తోంది. ముగ్గురు మంత్రుల పైన వేటు ఉండే అవకాశం ఉందని సమాచారం.
ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో కడప వేదిక గా టీడీపీ మహానాడు జరగనుంది. ఆ తరువాత జూన్ 12 నాటికి ప్రభుత్వం ఏర్పాటై తొలి ఏడాది పూర్తి కానుంది. ఈ సమయంలోనే పాలనా పరంగా కీలక నిర్ణయాలకు చంద్రబాబు సిద్దం అయ్యేలా ప్రణాళికలు ఖరారు చేస్తున్నారు. మంత్రివర్గంలోనూ మార్పులు ఉంటాయని పార్టీలో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవటం పైన చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో, నాగబాబుకు మంత్రి పదవి వేళ.. బీజేపీ నుంచి మరో మంత్రి పదవి కోసం ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. సామాజిక సమీకరణా లను పరిగణలోకి తీసుకొని బీజేపీ నుంచి అభ్యర్ధిని ఫైనల్ చేయనున్నారు.
కేంద్ర కేబినెట్ లో ఏపీ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఏపీ కేబినెట్ లోనూ బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులు ఉండాలనే చర్చ తెర మీదకు వచ్చింది. అందులో భాగంగా బీజేపీ నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన పైన చర్చ జరుగుతున్న ట్లు కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. నాగబాబు ఎంట్రీతో మంత్రులుగా జనసేనకు నాలుగు పదవులు దక్కుతున్నాయి. దీంతో, ఇప్పుడు బీజేపీకి మరో స్థానం కేటాయించాల్సి వచ్చిందనేది పార్టీ నేతల సమాచారం. ఈ కారణంగానే నాగబాబు చేరిక ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, పాటుగా మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా ఇద్దరు మంత్రులను పక్కన పెట్టే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.