అనంతపురంలోని రెండు కీలక నియోజకవర్గాల్లో జరుగుతున్న రాజకీయాలు.. జిల్లా వ్యాప్తంగా సెగలు రగు ల్చుతూనే ఉంది. నిజానికి ఆది నుంచి కూడా అనంతపురం రాజకీయాలు హాట్ హాట్‌గానే ఉంటున్నాయి. వైసీపీ ఇక్కడ పాగా వేసిన దరిమిలా మరింతగా ఈ రాజకీయాలు వేడెక్కాయి. ఇక.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తాడిపత్రి, అనంతపురం అర్బన్ నియోజకవర్గాలు.. వివాదాలకు కేంద్రంగా మారాయి. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో సాగుతున్న రాజకీయ వివాదాలు జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపుతున్నా యన్న చర్చ సాగుతోంది.
తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డికి మధ్య వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పెద్దారెడ్డి ఓడిపోయిన తర్వాత.. ఆయనను నియోజకవర్గంలోకి రాకుండా జేసీ అడ్డుకుంటున్నారు. కానీ, పెద్దారెడ్డి ఏదో ఒక రూపంలో నియోజకవర్గం లో రాజకీయాలను కెలుకుతూనే ఉన్నారు. దీంతో పోలీసులకు ఈ వ్యవహారం కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని పోలీసులు నిరంతరం టెన్షన్‌లోనే గడుపుతున్నారు.
ఇక, అనంతపురం అర్బన్ నుంచి విజయం దక్కించుకున్న ప్రభుత్వ మాజీ ఉద్యోగి, దగ్గుపాటి వెంకటేశ్వ ర ప్రసాద్ కూడా.. తానేమీ తక్కువ తినలేదని నిరూపించుకుంటున్నారు. టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మె ల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరితో ఆయన తీవ్రంగా విభేదిస్తున్నారు. వైకుంఠం వర్గాన్ని చీల్చడం.. తన వారిని ప్రోత్సహించడం.. పార్టీ పరంగా కూడా.. వైకుంఠం అనుచరులను కట్టడి చేయడంతో అంతర్గత కుమ్ములాటలకు వేదిగా ఈ నియోజకవర్గం మారిపోయింది.
ఇక, ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ చిత్రం విడుదల విషయంలోనూ.. ఎమ్మెల్యే దగ్గుపాటి చేసిన వ్యాఖ్యలు ఇంకా సమసిపోలేదు. దీనిపై పార్టీ అధిష్టానం కూడా తీవ్ర ఆగ్రహంతో ఉంది. మరోవైపు.. తాజాగా ఆదివా రం.. జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ నాయకులు 100 మందికిపైగా ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టారు. జూనియర్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. లేదా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు 10 మంది నాయకులను అరెస్టు చేశారు. మరోవైపు ఎమ్మెల్యే వీరి కన్నుగప్పి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇదీ.. అనంత పురంలో నెలకొన్న రాజకీయం.