ఏపీ రాజకీయాల్లో రప్పా రప్పా మారుమోగుతోంది. ఎక్కడ చూసినా దూకుడుగానే రాజకీయం సాగుతోంది. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. ఈ జిల్లా అనగానే జేసీ బ్రదర్స్ గుర్తుకు వస్తారు. అలాగే పరిటాల ఫ్యామిలీ కూడా కనిపిస్తారు. మరో వైపు చూస్తే వైసీపీ రాజకీయాల్లో కేతిరెడ్డి తోపుదుర్తి వంటి వారు కూడా ఫైర్ బ్రాండ్ గా ఉంటారు. గత పదిహేను నెలలుగా చూస్తే అనంత రాజకీయం వేడెక్కిపోతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ఢీడిక్కి కొడుతోంది.
అనంతపురం జిల్లాలో జేసీల రాజకీయ క్షేత్రంగా తాడిపర్తి ఉంది. జేసీ బ్రదర్స్ అక్కడ నుంచే గెలుస్తూ వస్తున్నారు. ఇక వైసీపీ నుంచి 2019లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి గెలిచారు. అలా జేసీలను పెద్దారెడ్డి ఎదురు నిలుస్తూ వస్తున్నారు. దాంతో ఇపుడు కూటమి పాలనలో పెద్దారెడ్డికి తాడిపత్రిలో ప్రవేశానికే ఇబ్బంది అవుతోంది. అలా జేసీ వర్సెస్ పెద్దారెడ్డిల మధ్య రాజకీయ మంట ఒక వైపు మండుతోంది.
ఇక అక్కడ నుంచి ముందుకు సాగితే రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో హీటెక్కించే పాలిటిక్స్ సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్సెస్ మాజీ వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం ఒక స్థాయిలో సాగుతోంది. ఒకరి మీద ఒకరు విమర్శలు ఘాటుగానే చేసుకుంటున్నారు. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో అవినీతి పెద్ద ఎత్తున సాగుతోంది అని ప్రకాష్ రెడ్డి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. దానికి ధీటుగా పరిటాల సునీత స్పందించారు.
తాను జైలుకు ఎపుడూ భయపడేది లేదని మూడు నాలుగు నెలలు కాదు ఏకంగా ఇరవయ్యేళ్ళ పాటు జైలు జీవితం అయినా తాను ఫికర్ అయ్యేది లేదని అంటున్నారు. తాను గతంలో దివంగత పరిటాల రవీంద్ర మీదనే పోరాటం చేసిన వాడిని అని దేనికీ జడిసేది లేదని ఆయన అంటున్నారు. తన నియోజకవర్గంలో అవినీతి మీద పోరాటం చేస్తాను అని స్పష్టం చేశారు.
ఇలా సవాళ్ళు ప్రతి సవాళ్ళతో రాప్తాడు రగులుతోంది. ఇరవయ్యేళ్ళ జైలు జీవితం అంటే హత్యలు చేసి వెళ్ళాలని చూస్తున్నారా అని పరిటాల సునీత నిలదీస్తున్నారు. అలాంటి ఆలోచనలు మానుకోవాలని జాగ్రత్తగా ఉండాలని సునీత ప్రకాష్ రెడ్డిని హెచ్చరించారు. తాము కూడా ప్రకాష్ రెడ్డి మాదిరిగా ఉంటే ఆయన జనంలో ఫ్రీగా తిరగగలిగేవారేనా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. జైలుకు వెళ్ళేందుకు రెడీగా ఉండు అని కూడా ఆమె గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే రాప్తాడులో అయితే రాజకీయంగా రెండు శిబిరాలు వేసవి వేడినే తలపిస్తున్నాయి. మరి రానున్న రోజులలో ఇది మరింతగా పెరిగి ఏ దిశగా చేరుతుందో చూడాలని అంటున్నారు. జైలుకు వెళ్తాను అని వైసీపీ నేతలే అంటూ మానసికంగా సిద్ధపడుతున్నారా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.