అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా మందిలించినట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం మంత్రివర్గ సమావేశంలో ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినట్లు టీడీపీ వర్గాల సమాచారం. వారం రోజుల వ్యవధిలో రెండోసారి సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే దగ్గుపాటి భేటీ కాగా, ఆయనపై వస్తున్న విమర్శలుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
అనంతపురం అర్బన్ లో ఎందరో సీనియర్లు ఉండగా, వారందరినీ కాదని మిమ్మల్ని (ఎమ్మెల్యే దగ్గపాటి) ప్రోత్సహిస్తే, మీరు నడుచుకునేది ఇలాగా అంటూ సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఇటీవల సోషల్ మీడియలో విస్తృత ప్రచారం జరిగింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే దగ్గుపాటిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విషయం వెలుగుచూసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎమ్మెల్యేని మందలించినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు శాంతించలేదు. దీంతో ఎమ్మెల్యేను అమరావతికి పిలిపించుకుని సీఎం మాట్లాడారు.
ఇదే సమయంలో ఎమ్మెల్యేపై వస్తున్న అనేక ఆరోపణలపై సీఎం నిలదీసినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా, వినేందుకు సీఎం ఆసక్తి చూపలేదని అంటున్నారు. తనకు అన్నీ తెలుసనని, ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. పద్ధతి మార్చుకోకపోతే ఉపేక్షించేది లేదని తీవ్ర స్వరంతో హెచ్చరించినట్లు సమాచారం. ఎంతో మంది సీనియర్లు పోటీ పడినా, వారిని కాదని ఎన్నికలలో పోటీకి టికెట్ ఇచ్చామని, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఎంతో బాధ్యతగా ఉండాల్సిందిపోయి, తరచూ వివాదాల్లో చిక్కుకోవడం ఏంటని సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
ఇకపై ఎలాంటి ఫిర్యాదులు రావడానికి వీల్లేదని, పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించవద్దని సీఎం ఆదేశించారని అంటున్నారు. కాగా, అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గాలకు మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ప్రభాకర్ చౌదరిని కాదని కొత్తగా దగ్గుపాటిని టీడీపీ అధిష్టానం ప్రోత్సహించింది. ఎన్నికల్లో దగ్గుపాటి విజయానికి పనిచేయాలని ప్రభాకర్ చౌదరిని ఆదేశించింది. అయితే ఎన్నికల వరకు ఇద్దరూ సఖ్యతగా ఉన్నప్పటికీ, ఫలితాలు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య గ్యాప్ పెరిగిపోతూ వస్తోంది. దీన్ని సరిచేసేందుకు అధిష్టానం ఇప్పటివరకు ప్రయత్నించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఒకరినొకరు రాజకీయంగా దెబ్బతీయడానికి అనైతిక పద్ధతులు పాటిస్తున్నారని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్గం కారణంగానే ఎమ్మెల్యే ఆడియో రికార్డులు సోషల్ మీడియాలో వచ్చాయని, పార్టీ పరువు పోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.