నటీనటులు: సుమంత్-కాజల్ చౌదరి- మాస్టర్ విహార్ష్-అవసరాల శ్రీనివాస్-అను హాసన్-రాకేష్ రాచకొండ-బీవీఎస్ రవి కౌముది నేమాని తదితరులు
సంగీతం: చందు రవి
ఛాయాగ్రహణం: పవన్ పప్పుల
మూల కథ: సలీల్ కులకర్ణి
సహ రచన-మాటలు: దీప్తి శ్రీ జుత్తాడా
నిర్మాతలు: రాకేష్ రెడ్డి గాదం-రుద్ర మాదిరెడ్డి
రచన-దర్శకత్వం: సన్నీ సంజయ్
ఒకప్పుడు సత్యం.. గోదావరి.. మళ్ళీ రావా లాంటి మంచి మంచి సినిమాలు చేసిన సుమంత్ నుంచి కొన్నేళ్లుగా సరైన చిత్రాలు రావట్లేదు. ఈ మధ్య తన సినిమాలు కూడా బాగా తగ్గిపోవడంతో తన గురించి అందరూ మరిచిపోతున్న దశలో ‘అనగనగా..’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ‘ఈటీవీ విన్’ ద్వారా రిలీజైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ: వ్యాస్ కుమార్ (సుమంత్) ఒక పెద్ద ప్రైవేటు స్కూల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు. తన భార్య భాగి (కాజల్ చౌదరి) అదే స్కూల్ కి ప్రిన్సిపల్. ఐతే స్కూల్లో టీచర్లందరిదీ ఒక దారి అయితే.. వ్యాస్ ది మరో దారి. బట్టీ పట్టి మార్కులు తెచ్చుకునే పద్ధతికి అతను వ్యతిరేకం. పిల్లలతో సరదాగా ఉంటూ.. వారికి కథలు చెబుతూ.. వాళ్లు ఇష్టంగా పాఠాలు నేర్చుకునేలా చేయాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ దీని వల్ల అతను చాలా ఇబ్బంది పడతాడు. స్వయంగా వ్యాస్ కొడుకు రామ్ (మాస్టర్ విహార్ష్) కూడా చదువులో వెనుకబడడంతో అందుకు రామ్ పెంపకమే కారణమనే విమర్శలు ఎదుర్కొంటాడు. ఈ పరిస్థితుల్లో ఆ స్కూల్ వదిలేసి సొంతంగా ట్యూషన్ చెప్పడం మొదలుపెడతాడు వ్యాస్. దాని ద్వారా మంచి ఫలితాలు రాబట్టి ఒక స్కూల్ కూడా మొదలుపెట్టాలని చూస్తున్న దశలో.. వ్యాస్ కు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి.. దాని వల్ల తన జీవితం ఎలాంటి మలుపు తిరిగింది.. స్కూల్ పెట్టాలన్న తన కల నెరవేరిందా.. ఈ విషయాలన్నీ తెర మీదే చూడాలి.
కథనం-విశ్లేషణ: పిల్లలను ఎలా పెంచాలి.. వాళ్లకు పాఠాలు ఎలా చెప్పాలి.. తల్లిదండ్రులు-ఉపాధ్యాయులు వాళ్లతో ఎలా వ్యవహరించాలి.. ఈ విషయాలను స్పృశిస్తూ.. వివిధ భాషల్లో అప్పుడప్పుడూ మంచి సినిమాలు వస్తుంటాయి. లాభాపేక్ష కంటే సమాజానికి ఏదో చెప్పాలని తీసే ఇలాంటి సినిమాలకు ప్రేక్షకుల ప్రోత్సాహం కూడా దక్కితే బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి ఫలితాలూ వస్తాయి. హిందీలో ‘తారే జమీన్ పర్’.. తమిళంలో ‘పసంగ-2’ (మేము).. తెలుగులో ‘35: చిన్న కథ’ లాంటి చిత్రాలు ఈ కోవకు చెందినవే. ఇప్పుడు సుమంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అనగనగా..’ కూడా వీటి బాటలోనే పిల్లలకు పాఠాలు చెప్పే తీరు గురించి జీవిత పాఠం నేర్పే కథతోనే తెరకెక్కింది. కథలో.. సన్నివేశాల్లో కొంచెం నాటకీయత ఉన్నట్లు అనిపించినా.. చెప్పాలనుకున్న విషయాన్ని ప్రభావవంతంగా.. ఉద్వేగభరితంగా చెప్పడంలో కొత్త దర్శకుడు సన్నీ సంజయ్ విజయవంతం అయ్యాడు. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ కొంచెం ఆగి ఆలోచిస్తారంటే.. దాని ఇంపాక్ట్ బలంగా ఉన్నట్లే.
పిల్లలవి సున్నితమైన మనస్తత్వాలు. చిన్నతనంలో వాళ్లలో ఏర్పడే అభిప్రాయాలు పిల్లల మనసుల్లో ఎంతో బలంగా నాటుకుపోతాయి. ఈ నేపథ్యంలో చదువుల పేరుతో వారి మీద బలవంతంగా రుద్దడం కంటే.. వాళ్ల మనసులను అర్థం చేసుకుని.. వాళ్లకు చెప్పాల్సిన భాషలో చెబితే అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యం చేస్తారనే మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం జరిగింది ‘అనగనగా’లో. వ్యాస్ కుమార్ అనే చక్కటి పాత్రలో సుమంత్ మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ ఇవ్వడం.. తన కొడుకు పాత్రలో మాస్టర్ విహార్ష్ అనే కుర్రాడు కూడా తనతో పోటీ పడి నటించడం.. తండ్రీ కొడుకుల ఎమోషన్ బాగా వర్కవుట్ కావడంతో ‘అనగనగా’ స్పెషల్ ఫిలింగా మారింది. ఇందులో చెప్పాలనుకున్న పాయింట్ అయితే కొత్తది కాదు. చాలా సినిమాల్లో చూసిందే. పోటీ ప్రపంచంలో స్కూళ్లు ఎలా ఉన్నాయి.. మార్కులే ప్రామాణికంగా అందులో పాఠాలు చెప్పే తీరు ఎలా ఉంటుంది.. తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు.. ఈ పరిస్థితుల్లో పిల్లలు ఎదుర్కొనే ఒత్తిడి ఎలాంటిది.. ఈ అంశాలను సృశిస్తూ సమస్యను చూపించి.. దానికి పరిష్కారంగా హీరో పాత్ర తెరపైకి రావడం.. ఈ సిస్టంకు వ్యతిరేకంగా హీరో పాత్ర వెళ్లి విజయం సాధించడం.. అందరిలో మార్పు తీసుకురావడం.. ఇదీ స్థూలంగా కథ.
సినిమా మొదలైన తీరుతోనే ఈ కథ ఎలా ఉంటుంది.. ఎలా ముందుకు సాగుతుందనే విషయంలో ఒక అంచనా వచ్చేస్తుంది. ఆరంభంలో సన్నివేశాలు కూడా ఒక మూసలో సాగిపోతున్నట్లు అనిపిస్తాయి. పాఠాలు ఎలా చెబుతున్నారు.. ఎలా చెప్పకూడదు.. ఎలా చెప్పాలి.. అనే విషయాల మీద కొన్ని సీన్లు రిపిటీటివ్ గా అనిపిస్తాయి. కానీ ముందు సాగే కొద్దీ హృదయాన్ని తాకే కొన్ని సన్నివేశాలతో ‘అనగనగా..’ కథ రక్తి కడుతుంది. ఒక సమస్యను బలంగా చూపించడం.. దానికి హీరో పరిష్కారం కనుక్కోవడం కూడా జరిగిపోవడంతో ప్రథమార్ధంలోనే ఈ కథ ముగిసిపోయిందనే భావన కలుగుతుంది. ఐతే విరామం దగ్గర కొత్త సమస్యను తెరపైకి తెచ్చి కథను మలుపు తిప్పాడు దర్శకుడు. అప్పటిదాకా ఒకలా నడుస్తున్న ‘అనగనగా..’ తర్వాత ఇంకో దారిలో నడుస్తుంది. ఓవైపు చావు బతుకులతో పోరాడుతూ.. ఇంకోవైపు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి హీరో చేసే పోరాటం.. మరోవైపు తండ్రీ కొడుకుల ఎమోషన్ మీద ఉద్వేగ భరితంగా నడుస్తుంది ‘అనగనగా’. ఇందులో హైలైట్.. తండ్రీ కొడుకుల చుట్టూ వచ్చే సన్నివేశాలే. తండ్రిని పిచ్చిగా ప్రేమించే కొడుకు.. ఆ తండ్రిని శాశ్వతంగా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో చాలా హృద్యంగా చూపించాడు దర్శకుడు. చివరి అరగంటలో కొన్ని సీన్లకు కన్నీళ్లు పెట్టని ప్రేక్షకుడు ఉండడు. కొంచెం నాటకీయత ఎక్కువ అయినట్లు అనిపించినా.. ఎమోషన్ మాత్రం బాగా పండింది. పిల్లాడి పాత్రను హైలైట్ చేస్తూ తీసిన సన్నివేశాలకు.. డైలాగులకు ప్రేక్షకులు కదిలిపోతారు. పాఠాన్ని ‘కథ’లా చెప్పడంలో ఉన్న ఆవశ్యకతను ఇందులో బలంగా చెప్పారు. ముగింపు సన్నివేశాలు కూడా దాని చుట్టూనే తిరుగుతాయి. సినిమా మీద ఇంప్రెషన్ పెంచుతాయి. కథలో పరిణామాలు.. మలుపులు అన్నీ చకచకా జరిగిపోవడం.. కొన్ని సీన్లు నాటకీయంగా అనిపించడం ‘అనగనగా’లో చెప్పుకోదగ్గ ప్రతికూలతలు. కానీ ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉండడం.. సమాజానికి ఎంతో అవసరమైన మంచి విషయాలు చెప్పడం దీనికి ప్లస్. నేరుగా ఓటీటీలో అందుబాటులో ఉన్న సినిమా కాబట్టి కొంచెం వీలు చేసుకుని చూస్తే ఆ రెండు గంటలు ‘వర్త్’ అనిపిస్తాయి.
నటీనటులు: గోదావరి.. మళ్ళీ రావా లాంటి సినిమాలు చూసినపుడల్లా.. సుమంత్ లోని మంచి నటుడిని దర్శకులు సరిగా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. పరిణతితో కూడిన పాత్రలను అతను బాగా పోషించగలడు. ‘మళ్ళీ రావా’ తర్వాత గాడి తప్పిన అతను.. మళ్లీ చాలా కాలానికి ఓ మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వ్యాస్ కుమార్ క్యారెక్టర్ తన ఫిల్మోగ్రఫీలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎక్కడా హద్దులు దాటకుండా పాత్ర పరిధిలో కొలిచినట్లు నటించాడు సుమంత్. సినిమా చివరికి వచ్చేసరికి వ్యాస్ పాత్ర మీద ప్రేక్షకులకు ఒక ఆపేక్ష కలుగుతుంది. ఐతే సినిమాలో బెస్ట్ పెర్ఫామర్ ఎవరంటే సుమంత్ కన్నా ముందు మాస్టర్ విహార్ష్ పేరు చెప్పాలి. చిన్న పిల్లాడే అయినా అంత బాగా ఎలా నటించగలిగాడని ఆశ్చర్యం కలుగుతుంది తన పాత్రను చూస్తుంటే. పాత్ర వయసుకు తగిన అమాయకత్వాన్ని చూపిస్తూనే.. ఎమోషన్లను కూడా చాలా బాగా పండించాడు విహార్ష్. తండ్రీ కొడుకుల ఎమోషన్ ప్రేక్షకులను కదిలించేలా చేయడంలో ఈ పాత్ర.. ఆ పిల్లాడి నటన కీలకం. సుమంత్ కు జోడీగా నటించిన కాజల్ చౌదరి కూడా బాగా నటించింది. కొత్తమ్మాయి అనే భావన కలగకుండా నీట్ గా ఆ పాత్రను చేసుకుపోయింది. నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో అవసరాల శ్రీనివాస్ మెప్పించాడు. అను హాసన్ చిన్నదే అయినా ఇంపాక్ట్ ఉన్న పాత్ర చేసింది. సహాయ పాత్రలో రాకేష్ రాచకొండ.. అతిథి పాత్రలో బీవీఎస్ రవి బాగానే చేశారు.
సాంకేతిక వర్గం: టెక్నికల్ గా ‘అనగనగా..’ ఓకే అనిపిస్తుంది. చందు రవి పాటలు.. నేపథ్య సంగీతం సినిమా శైలికి తగ్గట్లుగా సాగాయి. పాటలు మళ్లీ వినాలనిపించేలా లేకపోయినా.. సినిమాలో ఇమిడిపోయాయి. పవన్ పప్పుల ఛాయాగ్రహణం కూడా బాగానే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన మేర ఉన్నాయి. దీప్తి శ్రీ జుత్తాడా మాటలు బాగున్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ సన్నీ సంజయ్.. ఒక మంచి కథను ఎంచుకుని ఎఫెక్టివ్ గా తెర మీదికి తీసుకొచ్చాడు. కథలోని ఎమోషన్ని ప్రేక్షకుల్లోకి ఎక్కించడంలో అతను విజయవంతం అయ్యాడు. కథనం అక్కడక్కడా కొంచెం ఎగుడుదిగుడుగా సాగినప్పటికీ.. ఓవరాల్ గా దర్శకుడికి మంచి మార్కులు పడతాయి.
రేటింగ్ – 3/5