ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యం ఏదంటే అందరూ టక్కున చెప్పేది అమెరికా. ఈ దేశం ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలు అన్నింటిపై అజమాయిషీ చేస్తూ ఉంటుంది. అలాంటి అమెరికాలో చీమ కుట్టినా కానీ కనిపెట్టే టెక్నాలజీ ఉంది. అంతటి ఈ దేశంలో దొంగతనాలు చేయడం అంటే అంతా ఆషామాషీ కాదు. అలాంటి అమెరికాలో కూడా దొంగలు బీభత్సం సృష్టించారు. కేవలం కొన్ని సెకండ్లలోనే దొంగతనాన్ని పూర్తిచేసి తప్పించుకున్నారు. సినీ ఫక్కీలాగా జరిగినటువంటి ఈ తతంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం పోలీసులు ఆ దొంగలు ఎవరు అని కనిపెట్టే పనిలో పడ్డారు. ఏది ఏమైనప్పటికీ ఈ దొంగతనం అనేది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది.
సెకండ్ల వ్యవధిలో కోట్లాది రూపాయల విలువ చేసే సొమ్మును దోచుకున్నారు.. మరి ఈ దొంగతనం ఎక్కడ జరిగింది ఆ వివరాలు తెలుసుకుందాం.. అమెరికా ప్రపంచ దేశాలకు ఎంతో టెక్నాలజీని అందిస్తూ దూసుకెళ్తున్న దేశం. సాధారణంగా మన తెలుగు ప్రజలు కూడా అమెరికాకు వెళ్లి సెటిల్ అవుతూ ఉంటారు. అక్కడికి వెళ్లారు అంటే భవిష్యత్తు మారిపోతుందని భావిస్తారు. అలాంటి అగ్రరాజ్యంలోని సియాటిల్ నగరంలో మధ్యాహ్న సమయంలో భారీ దొంగతనం జరిగింది. మాస్కులు పూర్తిగా ధరించినటువంటి ఒక నలుగురు వ్యక్తులు తాళం వేసి ఉన్నటువంటి నగల దుకాణంలోకి చొరబడ్డారు. ముందుగా తాళాన్ని ఒక సుత్తితో పగలగొట్టి, ఆ తర్వాత గాజు తలుపులను కూడా అదే సుత్తితో బద్దలు కొట్టారు.
దుకాణంలోకి చొరబడినటువంటి దుండగులు కేవలం 90 సెకన్ల సమయంలోనే రెండు మిలియన్ డాలర్ల వజ్రాలు, ఖరీదైన గడియారాలు,హారాలను దోచుకెళ్లారు. మొత్తం వీటి విలువ 17.53 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ దుండగులు దుకాణ సిబ్బందిపై ఎలుగుబండ్లపై చల్లేటటువంటి స్ప్రే తో బెదిరించి ఎలక్ట్రికల్ తుపాకీతో దుకాణదారుడిని, సిబ్బందిని బెదిరింపులకు గురి చేశారు. దొంగతనం పూర్తయిన తర్వాత వారంతా కారులో ఎక్కి పారిపోయారు. అయితే ఈ దుండగులు పూర్తిగా మాస్కు ధరించి ఉండటంతో వారి ఫేసు గమనించడం పోలీసులకు సవాలుగా మారింది. ఇక్కడ సిసి టీవీలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. మరి చూడాలి అమెరికన్ పోలీసులు వీరిని ఎన్ని రోజుల్లో పట్టుకుంటారు అనేది ముందు ముందు తెలుస్తుంది. ఈ దొంగతనానికి సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో చాలామంది సినిమాల్లో చూపించినట్టే దొంగతనం చేశారుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.