కేసుల పేరుతో ప్రభుత్వం బెదిరిస్తే తాను బెదిరిపోయే మనిషిని కానని, అన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లో కొనసాగుతున్నానని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన అంబటి రాంబాబు పలు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీనిపై ఓ పత్రికలో కథనం రావడం, ఆ తర్వాత విజిలెన్స్ విచారణకు ఆదేశాలు రావడాన్ని మాజీ మంత్రి అంబటి తీవ్రంగా పరిగణించారు. మంత్రి లోకేశ్ కుట్ర వల్లే పేపర్లు, టీవీ చానళ్లలో తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం అవుతాయని, ఆ తర్వాత విజిలెన్స్ విచారణ అంటూ కేసు పెడతారని ఆయన వ్యాఖ్యానించారు. కేసులు పెట్టి జైలుకు పంపుతామంటే తాను భయపడే రకం కాదని స్పష్టం చేశారు.
మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ బెదిరింపులకు తన కుక్క కూడా భయపడదని మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. కుట్రతోనే నాపై కేసులు పెడుతున్నారని, 14 నెలల తర్వాత నాపై అవినీతి ఆరోపణలు గుర్తుకువచ్చాయా? అంటూ ప్రశ్నించారు. వైసీపీ తరఫున నేను గట్టిగా మాట్లాడుతున్నానని, నా గొంతు నొక్కాలని విజిలెన్స్ విచారణకు ఆదేశించారని చెప్పారు. విచారణ జరగకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్ ప్రకారంపై తనకు వ్యతిరేకంగా రిపోర్టు సిద్ధమై ఉంటుందని, ఆ రిపోర్టును ఏసీబీకి పంపి నేను అవినీతి చేశానని చెబుతూ అరెస్టు చేయిస్తారని అంబటి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో మంత్రి నారా లోకేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ముగ్గురు మీడియా చానళ్ల అధిపతులు కలిసి వైసీపీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి అంబటి ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ను వేధించేందుకు, ఆయన వద్ద పనిచేసిన అధికారులు, ఆయనతో ఉన్న నేతలను కేసుల్లో ఇరికిస్తున్నారని విమర్శించారు. లిక్కర్ కేసు ఉండగా, తనపై స్పెషల్ కేసు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని, బహుశా లిక్కర్ స్కాంలో ఇరికిస్తే, నిరూపించలేమని భావించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖలో కూడా తాను అవినీతి చేశానేమో అని వెతుకుతున్నారని ఏమి చేసుకున్నా, ఎంత ప్రయత్నించినా అవినీతి నిరూపించలేరని అన్నారు.
తనపై కుట్ర పూరితంగా నిందలు వేస్తున్నారని, దీనికి తగిన సమయంలో సమాధానం చెబుతామని అంబటి తెలిపారు. తనను అంబోతు అంటూ టీవీ చానళ్లలో ప్రచారం చేస్తున్నారని, వారికి మించిన అంబోతు ఎవరు ఈ రాష్ట్రంలో లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై కేసులు పెట్టి పండగ చేసుకుంటున్నారని, కేసు పెడితే తాను ఎంజాయ్ చేస్తానని అంబటి వ్యాఖ్యానించారు. గతంలో డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేశా.. ట్రెక్కింగ్ చేసి ఎంజాయ్ చేశా.. ఇప్పుడు కేసు పెట్టి జైలుకు పంపితే జైలింగును ఎంజాయ్ చేస్తా అంటూ చెప్పారు. తాను అవినీతిపరుడినో కానో సత్తెనపల్లిలో అడిగి తెలుసుకోవాలన్న మాజీ మంత్రి.. సత్తెనపల్లిలో పేకాట శిబిరాలు, కోడి పందెలు నిర్వహించినట్లు గతంలో ఎందుకు వార్తలు రాయలేదని ప్రశ్నించారు.
బతికితే హీరోగా బతకాలి, పిరికివాడిగా బతకకూడదని నిర్ణయించుకున్నానని చెప్పిన అంబటి.. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రపై కోర్టుల్లోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడమే కాకుండా, తనను జైలులో వేసినా ఫర్వాలేదు. మాకు ఓ రోజు వస్తుందని తేల్చిచెప్పారు. నేను తప్పు చేశానో లేదో ప్రజలు, భగవంతుడు నిర్ణయిస్తారే కానీ, విజిలెన్స్, పోలీసులు, చంద్రబాబు లోకేశ్ నిర్ణయించరు అని అన్నారు.