ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఖాయమైంది. అధికారిక ప్రక్రియ వేగవంతం అయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం కసరత్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు ప్రతిపాదిత జిల్లా, మండలాల పైన అభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మేరకు అమరావతి కొత్తగా అర్బన్ జిల్లాగా ఏర్పాటు కానుంది. కొత్త జిల్లాలుగా పరిశీలనకు వచ్చిన వాటి పైన ఇక అధికారిక నిర్ణయం మిగిలి ఉంది.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో ఉపసంఘం ఇప్పటికే ప్రజల వినతులు స్వీకరించడం ప్రారంభించింది. జిల్లాల కలెక్టర్లు కూడా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. జనగణన షెడ్యూల్ కారణంగా 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు లేదా పేర్ల మార్పులు చేయడం సాధ్యం కాదు. అందువల్ల అన్ని మార్పులు 2025 డిసెంబరు 31లోగా పూర్తి చేసి అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగా ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే వస్తున్న ప్రతిపాదనలు జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. అభిప్రాయ సేకరణ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఇక, ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశం పరిశీలనలో ఉంది. అదనంగా బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాలను మళ్లీ ప్రకాశం జిల్లాలో కలిపితే పరిపాలనా సౌలభ్యం కలుగుతుందని భావిస్తున్నారు. దీంతో పాటుగా అనంతపురం, మన్యం జిల్లా వంటి పైన కొత్త ప్రతిపాదనలు అదుతున్నాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో పాటు మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలను కలిపి ఐదు నియోజక వర్గాలను కలిపి జిల్లాగా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో, గుంటూరు జిల్లాలో మిగిలే గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి నియోజకవర్గాలు మరో జిల్లాగా కొనసాగనున్నాయి.
రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ముందుకొచ్చింది. రంపచోడవరం, చింతూరు డివిజన్లతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు ఆలోచనలో ఉంది. కొన్ని నియోజకవర్గాల పునర్విభజనపై కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని యోచిస్తున్నారు. దీని వల్ల ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య, తిరువూరు, మైలవరం, గన్నవరం, పెనమలూరు సహా ఏడు నియోజకవర్గాలు ఉంటాయి. అదే విధంగా శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో, మండపేటను తూర్పుగోదావరిలో, రామచంద్రపురంను కాకినాడ జిల్లాలో చేర్చే అవకాశం ఉంది. కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో చేర్చాలని ప్రతిపాదనలు వచ్చాయి.