ఏపీ రాజధాని అమరావతి తొలి దశ పనులను 2027 నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న కూటమి ప్రభుత్వం దీనికి తగిన విధంగా ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగుతోంది. తాజాగా ఈ ప్రణాళికలను సీఆర్ డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) అధికారులు వివరించారు. వీరు వెలువరించిన వివరాల ప్రకారం.. అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అమరావతిలో 79 ప్రాజెక్ట్ ల పనులు ప్రారంభమయ్యాయి.
వీటిలో సీఆర్డీఏ నుంచి 12,762.46 కోట్ల రూపాయల విలువైన 19 పనులు, ఏడీసీఎల్ నుంచి 36,737.06 కోట్ల రూపాయల విలువైన 60 పనులు మొత్తంగా 49,499.52 కోట్ల రూపాయల విలువైన 79 పనులు జరుగుతున్నా యి. మొత్తం 54,693.09 కోట్ల విలువైన 90 పనులకు పాలనాపరమైన అనుమతులు రాగా….వీటిలో 79 పనులు ప్రారంభమయ్యాయి. మరో 7 పనులు టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. మరో 5 పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. ఇవికాకుండా మరో 36,577 కోట్ల విలువైన 20 పనులకు పాలనాపరమైన అనుమతులు రావాల్సి ఉంది.
వీటికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. 2027 నాటికి తొలి దశ పూర్తవుతుందని చెప్పారు. ప్రస్తుతం వర్షాలు వచ్చినా.. వరదలు వచ్చినా.. పనులు నిర్విఘ్నంగా సాగుతు న్నాయి. మరోవైపు మంత్రి నారాయణ కూడా పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రధాన కార్యాలయం కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో అమరావతి వేగం మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు వివరించారు.