ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చారని , ఈ సందర్భంగా రైతులకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. అమరావతిలో 15 బ్యాంకులకు, ప్రభుత్వరంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఈ తరహాలో ల్యాండ్‌పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అన్నారు.
‘అమరావతి పనులు ఊపందుకున్న సమయంలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఘనత కేంద్రానిదే. రాష్ట్ర ఆర్థికస్థితిని గుర్తించి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోంది. కేంద్రం సహకారంతో ఏపీలో పలు రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. రాజధాని అమరావతిని మరో స్థాయికి తీసుకెళ్లాలా పనులు చేసి చూపిస్తాం. దేశం మొత్తం గర్వపడేలా అమరావతిని తీర్చిదిద్దుతాం. టెక్నాలజీని అందిపుచ్చుకునే హబ్‌గా రాజధానిగా అమరావతిని మార్చుతాం. ఏడు జాతీయ రహదారులు అమరావతికి అనుసంధానం కానున్నాయి. రహదారులతో కనెక్టివిటీ పెరుగుతుంది. కంపెనీలు సైతం అమరావతి వైపు చూస్తున్నాయని’ చంద్రబాబు అన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ ఏర్పాటయ్యాక ప్రధాని మోదీ రాజధాని అమరావతి పనులను మళ్లీ శంకుస్థాపన చేసి పనులు రీస్టార్ట్ చేశారు. మార్చి 2028 నాటికి పూర్తయ్యేలా అమరావతి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అందుకు ముఖ్య కారణం ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అమరావతి నిర్మాణానికి మాకంటే వేగంగా రూ.15వేల కోట్ల నిధులు అందించారు. తాజాగా రూ.1,334 కోట్లతో వివిధ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల భవనాలకు నేడు శంకుస్థాపన చేశారు. ఒకేచోట ఏర్పాటు చేస్తున్న అన్ని కార్యాలయాలలో మొత్తం 6500 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. నిర్మలా సీతారామన్ తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంది. ఏపీకి సరైన సమయంలో నిధుల కొరత లేకుండా చూస్తున్నారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, అమరావతి రాజధాని పునర్నిర్మాణంతో పూర్వ వైభవం పొందుతోందని పేర్కొన్నారు. నూతన రాజధాని అమరావతి ఆర్థికంగా మరింత పరుగులు పెట్టేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా ఒకేసారి 15 బ్యాంకులకు శంకుస్థాపన చేసే అరుదైన కార్యక్రమం ఇది అని ఆమె తెలిపారు. రాజధాని అమరావతి కోసం త్యాగం చేసిన రైతుల పాత్రను ఎప్పటికీ మరిచిపోవద్దని, ఇక్కడ ఏర్పాటు చేస్తున్న బ్యాంకులు అటువంటి రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
దేశ వ్యాప్తంగా కూరగాయలకు, పండ్లకు డిమాండ్ పెరుగుతోందని ఆమె అన్నారు. రైతులు పండించిన పంటల మార్కెటింగ్ కోసం వారానికి రెండు లేదా మూడు సార్లు ప్రత్యేక రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేశారని నిర్మలా సీతారమన్ గుర్తుచేశారు. విభజన తర్వాత వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుండి పూర్తిగా సహకరించేందుకు ప్రధాని సిద్ధంగా ఉన్నారని హామీ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ(AI)కి సంబంధించి రాష్ట్రంలో రెండు జిల్లాలలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, దానికి బడ్జెట్ పరంగా కేంద్రం నుండి సహాయ సహకారాలు అందిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కోసం క్వాంటం వ్యాలీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే, సైన్స్ సబ్జెక్టుల పైన పూర్తిగా దృష్టి పెట్టేందుకు వీలుగా సైన్స్ ప్లానిటోరియం ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.













