కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరగనున్న స్వాతంత్య్ర వేడుకలను అమరావతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్నేళ్లుగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలోనే నిర్వహిస్తున్నారు. అయితే ఈ సారి వేదికను మార్చి తొలిసారిగా రాజధాని అమరావతిలో నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 సెప్టెంబరులో రాజధాని అమరావతిని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత ఏడాది అక్టోబరులో రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అయితే రాజధాని ప్రాంతంలో ఇప్పటివరకు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల స్వాతంత్య్ర వేడుకలను అమరావతిలో నిర్వహించలేకపోయారు.
ప్రస్తుతం రాజధాని అమరావతి పనులు చురుగ్గా జరుగుతుండటంతో ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలను రాజధాని ప్రాంతంలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 79వ స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వెలగపూడిలో ఉన్న సచివాలయం వెనుక ఖాళీ స్థలంలో పంద్రాగస్టు వేడుకలను నిర్వహించనున్నామని సీఎస్ విజయానంద్ ప్రకటించారు. ఈ స్థలంలోనే గతంలో పీ-4 సభను నిర్వహించారు. దీంతో రాజధానిలో తొలిసారిగా స్వాతంత్య్ర వేడుకలు జరగనున్నట్లు చెబుతున్నారు.
2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున కర్నూలులో స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించారు. ఆ తర్వాత ఏడాది కూడా రాజధాని పనులు ప్రారంభానికి నోచుకోకపోవడంతో విశాఖపట్నంలో చేపట్టారు. ఇక 2016లో అనంతపురంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా వందనం చేశారు. 2017 నుంచి ఇప్పటివరకు విజయవాడలోనే ఆగస్టు 15 వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. అంటే దాదాపు 11 ఏళ్లు రాష్ట్ర రాజధానిలో ఆగస్టు 15 వేడుకలు జరగలేదు. అయితే ఇప్పుడు రాజధానిలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పంద్రాగస్టు వేడుకలను అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.