రాజధాని అమరావతిలో కృష్ణా నదిపై కొత్త ఐకానిక్ వంతెన కోసం ప్రజల అభిప్రాయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం.. నాలుగు డిజైన్లు రూపొందించింది. ఈ నాలుగు డిజైన్లలో అత్యుత్తమ డిజైన్ ఎంపిక చేసే విషయంలో ప్రజాభిప్రాయానికి విలువ నివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిసైడ్ అయ్యారు. నాలుగు డిజైన్లను ఆన్ లైనులో ఉంచి ఓటింగు ద్వారా అత్యుత్తమ డిజైన్ ఎంపిక చేయాలని ప్రజలను ప్రభుత్వం కోరింది. రాజధాని అమరావతిని విజయవాడ-హైదరాబాద్ జాతీయరహదారితో అనుసంధానించే రోడ్డులో ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మించి, ఆ రోడ్డుకు పర్యాటక శోభ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి అమరావతికి మరింత అందం తీసుకువచ్చేలా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని నుంచి హైదరాబాద్ హైవేకు వెళ్లే మార్గంలో ఇప్పటికే ఒక బ్రిడ్జిని నిర్మించారు. వెస్ట్ బైపాస్ లో దాదాపు 3 కి.మీ. మేర నిర్మించిన వంతెన ఎంతో ఆకట్టుకుంటుంది. అయితే కొత్తగా అమరావతిలోని రాయపూడి నుంచి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు 5 కి.మీ. మేర మరో వంతెన నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ఈ వంతెనను ఐకానిక్ గా నిర్మించాలని నిర్ణయం తీసుకోవడమే కాకుండా నాలుగు డిజైన్లు రెడీ చేయడం విశేషం. ఇందులో ఒకదాన్ని ప్రజల ఓటింగు ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించడం కూడా విశేషంగా చెబుతున్నారు.
ఈ కేబుల్ బ్రిడ్జి డిజైన్లు ఆధునిక ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా రాజధాని ప్రాంతానికే ప్రత్యేకంగా చెప్పే కూచిపూడి కళను మిళితం చేస్తూ డిజైన్ చేశారు. ప్రజల ఓటింగుకు పెట్టిన నాలుగు డిజైన్లలో మడు కూచిపూడి నృత్య శైలిని ప్రతిబింబించడం విశేషం. మిగిలిన డిజైన్ రాజధాని అమరావతిని ప్రమోట్ చేసేలా ‘A’ ఆకారంలో ఉంటుంది. ఈ డిజైన్లు అన్నీ రాష్ట్రానికి, అమరావతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఉండటం విశేషం. నాలుగు డిజైన్లు అద్భుతంగా ఉండటంతో ప్రజల అభిప్రాయాన్ని స్వీకరించి, తుది డిజైన్ ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.
ఇక ఐకానిక్ వంతెన డిజైన్లు ఎంపిక చేయడం, ఆ డిజైన్లను వీక్షించడానికి ప్రజలు ముందుగా సీఆర్డీఏ వెబ్ సైట్ కు వెళ్లాల్సివుంటుంది. అక్కడ హోం పేజీలో ‘ఓట్ ఫర్ అమరావతి ఐకానిక్ బ్రిడ్జి డిజైన్’ స్క్రోల్ అవుతుంది. https://crda.ap.gov.inపై క్లిక్ చేసి పేరు, ఫోన్ నెంబరు నమోదు చేయాలి. అందుబాటులో ఉన్న నాలుగు డిజైన్లలో ఒక దాన్ని ఎంపిక చేయాల్సివుంటుంది. అనంతరం క్యాప్చా కోడ్ ఇచ్చి మీ ఓటు నమోదు చేయాల్సివుంటుంది.
ఇక నాలుగు డిజైన్లలో మొదటిది కూచిపూడి నృత్యంలో, హస్త ముద్రలా ఉంటుంది. ఇది రేడియేటింగ్ కేబుల్ బ్రిడ్జి. ఇంజనీరింగ్ అద్భుతంగా కూచిపూడి కళను రంగరించి నిర్మించే ఐకానిక్ వంతెనగా దీన్ని చెబుతున్నారు. ఇక ఆప్షన్ 2లో ఎరుపు, తెలుపు రంగుల్లో రెండు జంట పైలాన్లతో మన సంస్కృతికి, అదృష్ణానికి చిహ్నంగా. స్వస్తిక హస్త భంగిమలో కనిపిస్తుంది. దీన్ని కూచిపూడి డాన్స్ బ్రిడ్జిగా వ్యాఖ్యానిస్తున్నారు. అదేవిధంగా మూడో ఆప్షన్ గా అమరావతి లోగో A ఆకారంలో, అభయ ముద్రలో శాంతికి చిహ్నంగా రూపొందించారు. ఆప్షన్ 4 కింద కూచిపూడి నృత్యంలోని కపోత ముద్రలో, చేతులు ఎత్తి అభివాదం చేస్తున్నట్లుండే ఐకానిక్ వంతెన డిజైన్ చేశారు.