అల్జీమర్స్ లక్షణాలు..
మాటలు గుర్తు ఉండకపోవడం
దేనిపైనా ఆసక్తి లేకపోవడం
మానసిక పరిస్థితి మారిపోతూ ఉండడం
కోపం వస్తూ ఉండడం
ఎలా జీవించాలో మర్చిపోతూ ఉండడం
అల్జీమర్స్‌ను నివారించే చికిత్సఏదీ లేదని డాక్టర్లు అంటున్నారు.
మనిషి జీవన శైలిలో మార్పు వల్లనే దీని బారి పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు.
”డిమెన్షియా బారిన పడకుండా ఉండాలంటే మన డైట్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా సహజంగా లభించే వివిధ రకాల కాయగూరల్ని, పండ్లను తీసుకోవాలి. సామాజికంగా,శారీరకంగా,మానసికంగా ఉత్తేజంగా ఉంటూ ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకుంటే డిమెన్షియాను నివారించలేకపోయినా చాలా రోజుల వరకూ ఙ్ఞాపకశక్తిని కోల్పోకుండా ఉండచ్చు”సాధారణంగా అల్జీమర్స్ (జ్ఞాపకశక్తిని కోల్పోయే వ్యాధి) వృద్ధుల్లో కనిపిస్తుంది. ‘ఉరి’, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ వంటి సినిమాల్లో అల్జీమర్స్‌తో బాధపడుతున్న వృద్ధ మహిళల పాత్రలు కనిపిస్తాయి.
అయితే ఈ వ్యాధి చిన్నవయస్సు వారిలో అంటే 20లలో, 30లలో ఉన్నవారికి కచ్చితంగా రాదని చెప్పొచ్చా?
చెప్పలేం. ఎందుకంటే చైనాలో ఒక 17 ఏళ్ల కుర్రాడిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించినట్లు, 19 ఏళ్లు వచ్చే నాటికి ఆయనకు అల్జీమర్స్ నిర్ధరణ అయినట్లు ‘ద జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్’లో ప్రచురించారు.అలాగే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్-యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెలెస్ ఆడిటరీ వర్బల్ లెర్నింగ్ టెస్ట్ (డబ్ల్యూహెచ్‌వో-యూసీఎల్‌ఏ ఏవీఎల్‌టీ)లో వచ్చిన స్కోరు కూడా బీజింగ్‌కు చెందిన ఈ 17 ఏళ్ల అబ్బాయికి తీవ్రమైన మతిమరుపు వచ్చినట్లు ధ్రువీకరించింది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెబ్‌సైట్ ప్రకారం, అల్జీమర్స్ అనేది ఒక న్యూరో డీజనరేటివ్ బ్రెయిన్ డిజార్డర్. డిమెన్షియాకు మరో రూపం. ఈ వ్యాధి మెల్లమెల్లగా ఒక వ్యక్తి జ్ఞాపకశక్తిని, ఆలోచనా, తార్కిక శక్తిని నాశనం చేస్తుంది. ఒక్కొక్కటిగా అన్ని జ్ఞాపకాలను తుడిచిపెట్టేస్తుంది. చాలామందిలో 65 ఏళ్ల తర్వాత ఇలాంటి ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. వృద్ధాప్యం అంటే.. వయసు పైబడటం దీనికి ముఖ్యకారణం. 65 ఏళ్ల కంటే ముందే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆ పరిస్థితిని ఎర్లీ ఆన్‌సెట్ అల్జీమర్స్ అని పిలుస్తుంటారు. ఎర్లీ ఆన్‌సెట్ అల్జీమర్స్ చాలా అరుదు.
నార్వేలో జరిగిన ఒక అధ్యయనంలో, దేశంలోని ప్రతి లక్ష మందిలో 163 మంది ఎర్లీ ఆన్‌సెట్ అల్జీమర్స్ బారిన పడినట్లు తేలిందని, అంటే దేశ జనాభాలో వీరి శాతం 0.5 శాతమని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పేర్కొంది.ఇక 30లలో, 40లలో ఈ వ్యాధి బారిన పడిన వారు మరింత తక్కువ. చిన్న వయస్సులోనే ఇది రావడానికి కారణం దగ్గరి బంధువుల్లో ఎవరైనా ఈ వ్యాధితో బాధపడటం.
ఈ వ్యాధి ఎలా అభివృద్ధి చెందుతుందనే ఇంకా పరిశోధిస్తున్నందున దీన్ని నివారించే కచ్చితమైన ఉపాయాలేవీ ఇంకా లేవు.
సైయారా సినిమాలో.. తనను ప్రేమించి వదిలేసిన మాజీ ప్రియుడు మహేశ్, తనను ఎంతగానో ప్రేమించే క్రిష్ కపూర్‌ల విషయంలో వాణి గందరగోళం చెందుతుంది. అల్జీమర్స్ వచ్చాక క్రిష్‌ను మహేశ్ అంటూ పిలవడం, క్రిష్ ఎవరో మర్చిపోయి అతనిపైనే కత్తితో దాడి చేయడం, మహేశ్‌ను తనవాడిగా ఊహించుకోవడం వంటి పనులతో ఆందోళన చెందుతుంది.అల్జీమర్స్ లక్షణాలు ఇలాగే ఉంటాయా అంటే, మతిమరుపు ఈ వ్యాధికి తొలి సంకేతం అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పేర్కొంది.
అందులో ఉన్న సమాచారం ప్రకారం, చాలా మందిలో ప్రజ్ఞా సామర్థ్యాలు క్షీణిస్తుంటాయి. అంటే సరైన పదాలు గుర్తురావు. రీజనింగ్, జడ్జిమెంట్ చేయలేరు. ఇవన్నీ తొలి లక్షణాలు. ఈ వ్యాధి ముదిరిన కొద్ది డ్రైవింగ్ చేయడం, వంట ఇలా రోజువారీ పనులు కూడా చేయలేకపోతారు. అడిగిన ప్రశ్ననే పదే పదే అడగడం, దారి తప్పిపోవడం, వస్తువులు ఇక్కడా అక్కడా పెట్టడం చేస్తుంటారు. చిన్న చిన్న విషయాలకే కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అల్జీమర్స్ ఉన్నవారు చివరకు తినడం, నడవటం వంటి పనులను కూడా చేయలేకపోతారు.
అల్జీమర్స్ మొదట మెదడులో జ్ఞాపకశక్తితో ముడిపడి ఉన్న భాగాలను నాశనం చేస్తుంది. తర్వాత భాష, రీజనింగ్, సోషల్ బిహేవియర్ వంటి భాగాలను ప్రభావితం చేస్తుంది. అలా మెదడులోని ఇతర భాగాల్ని కూడా నాశనం చేస్తుంది.మెదడులోని అమిలాయిడ్, టౌ ట్యాంగిల్స్ అనే ప్రోటీన్లు పెచ్చుల్లా పేరుకుపోవడం వల్ల అల్జీమర్స్ వస్తుంది. ఈ పెచ్చులు మెదడు కణాల సాధారణ పని తీరును దెబ్బతీస్తాయి. మెదడుకు, శరీరానికి సమాచారాన్ని చేరవేసే న్యూరాన్లు సరిగా పనిచేయకపోవడం, అవి క్షీణించడం వల్ల కూడా ఇలా జరుగుతుంది.
అల్జీమర్స్‌ను నయం చేయలేమని, కానీ మందులతో వ్యాధి ముదరడాన్ని నెమ్మదించేలా చేయవచ్చని సినిమాలో వాణికి డాక్టర్ భరోసా ఇస్తారు.దీనికి తగినట్లే, కొన్ని మందులు అల్జీమర్స్ వ్యాధి వేగాన్ని తగ్గిస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో నిరూపితమైంది.వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడు డోనానెమాబ్, లెసెనెమాబ్ అనే ఔషధాలు మెదడులోని అమిలాయిడ్ ప్రొటీన్‌ను టార్గెట్‌గా చేసుకొని పనిచేస్తాయని ట్రయల్స్‌లో తేలింది.అయితే ఈ మందులు పెద్దగా ప్రభావం చూపవు. ఇవి వ్యాధిని పూర్తిగా నయం చేయలేవు. ఈ ఔషధాలు ఇంకా ఆసుపత్రుల్లో వాడకానికి ఇంకా అందుబాటులోకి రాలేదు.
అయితే, కొత్త జ్ఞాపకాలు ఏర్పరచుకోవడం, డైట్, వ్యాయామం, తగినంత నిద్ర, యాంటీయాక్సిడెంట్స్, కాగ్నిటివ్ ట్రైనింగ్ వంటి థెరపీలు సహాయపడతాయి.అల్జీమర్స్ నిర్ధరణ అయ్యాక ఆ వ్యక్తి సగటు జీవితకాలం 3 ఏళ్ల నుంచి 11 ఏళ్లు ఉండొచ్చని మయో క్లినిక్ పేర్కొంది.అయితే కొంతమందికి ఇది 20 ఏళ్లుగా ఉందని వెబ్‌సైట్‌లో పేర్కొంది.వ్యాధిని ఏ దశలో నిర్ధారించారు, వ్యాధిపై నియంత్రణ సాధించడం, ఇతర చర్యలపై ఇది ఆధారపడి ఉంటుంది.65 ఏళ్లలోపు వారికి జ్ఞాపకశక్తి తగ్గడానికి అత్యంత సాధారణం కారణం నిద్ర లేమి అని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పేర్కొంది. దీనితో పాటు పెరిమెనోపాజ్, మందుల వల్ల కలిగే సైడ్ఎఫెక్ట్స్, డిప్రెషన్, యాంగ్జైటీ, డ్రగ్స్, ఆల్కహాల్, తలకు బలంగా తగిలిన గాయాలు, విటమిన్ల లోపం, థైరాయిడ్ డిజార్డర్స్, కీమో థెరపీ, స్ట్రోక్స్, ఇతర న్యూరోలాజికల్ డిజార్డర్లు కారణం అవుతాయి.
జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడానికి ఏ వయసులోని వారైనా చేయగలిగే, అల్జీమర్స్ ముప్పును తగ్గించుకోగలిగే కొన్ని ఉపాయాలు ఉన్నాయి.ఏరోబిక్ వ్యాయామం చేయడం, ఆల్కహాల్-డ్రగ్స్-గంజాయి తీసుకోకపోవడం, బాగా నిద్రపోవడం, సోషల్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనడం, మ్యూజిక్ వినడం, మైండ్‌ఫుల్‌నెస్ సాధన చేయడం వంటివి సహకరిస్తాయి.