మూవీ రివ్యూ : ‘అఖండ 2: తాండవం’
నటీనటులు: నందమూరి బాలకృష్ణ- సంయుక్త- ఆది పినిశెట్టి- హర్షాలీ మల్హోత్రా-శశ్వత ఛటర్జీ- కబీర్ సింగ్ దుల్హాన్- శరత్ లోహితశ్- పూర్ణ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: రామ్ ప్రసాద్- సంతోష్ డెటాకే
నిర్మాతలు: రామ్ ఆచంట- గోపీనాథ్ ఆచంట
రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనులది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన సింహా.. లెజెండ్.. అఖండ.. ఒకదాన్ని మించి ఒకటి హిట్టయ్యాయి. ఇప్పుడు ఈ జోడీ ‘అఖండ’ సీక్వెల్.. ‘అఖండ: తాండవం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబరు 5నే విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాలతో వాయిదా పడింది. అయినా సినిమాపై అంచనాలేమీ తగ్గలేదు. మరి ఆ అంచనాలను సినిమా ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
మురళీకృష్ణ (బాలకృష్ణ) రాయలసీమ ప్రాంతంలో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే. అతడి కూతురు జనని (హర్షాలి మల్హోత్రా) డీఆర్డీవోలో సైంటిస్ట్. దేశ రక్షణ కోసం కష్టపడే సైనికులు ఏ వాతావరణంలో అయినా తట్టుకునేలా ఆమె బయో సూట్ తయారు చేస్తుంది. దాని మీద ట్రయల్స్ నడుస్తుండగానే.. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే ఒక రాజకీయ నాయకుడి అండతో చైనా ఆర్మీ జనరల్ కుట్ర పన్ని ఒక వైరస్ గంగా నదిలో కలిసేలా చేస్తాడు. కుంభమేళాకు వచ్చిన లక్షలాది మందికి వైరస్ అంటి దేశం అల్లకల్లోలంగా మారుతుంది. ఆ వైరస్ కు వ్యాక్సిన్ తయారు చేసే బాధ్యత కూడా జననినే తీసుకుంటుంది. కానీ ఆ వ్యాక్సిన్ ను కూడా నాశనం చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఆ స్థితిలో అఘోరా అయిన మురళీకృష్ణ సోదరుడు అఖండ (బాలకృష్ణ) రంగప్రవేశం చేస్తాడు. మరి శత్రువులతో అతనెలాంటి పోరాటం చేశాడు.. దేశానికి ఎదురైన ముప్పును తప్పించడానికి ఏం చేశాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
ఒక హీరో చేస్తే ‘మాస్’ అనిపించే ఒక సన్నివేశం.. ఇంకో హీరో చేస్తే అతిగా అనిపిస్తుంది. ఆ హీరోకు ఉన్న ఇమేజిని బట్టి చూసే దృక్కోణం మారిపోతుంటుంది. టాలీవుడ్లో మాస్ పేరుతో కొంచెం అతి చేసినా చెల్లే హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. దర్శకుల్లో బోయపాటి శ్రీనుకు కూడా ఇలాంటి ఇమేజే ఉంది. వీళ్లిద్దరూ కలిసి చేసిన మాస్ విధ్వంసాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే వరుసగా మూడు బ్లాక్ బస్టర్లు కొట్టేసరికి.. ఏం చేసినా చెల్లిపోతుందనే అతి విశ్వాసంతో ‘అఖండ 2.. తాండవం’ తీశారా అన్న సందేహం కలుగుతుంది సినిమా చూస్తున్నంతసేపు. బాలయ్య-బోయపాటి అంటేనే అన్నీ కొంచెం అతిగా ఉంటాయనే అంచనాతోనే థియేటర్లలోకి వెళ్లినా సరే.. ‘అఖండ-2’లోని అతి హద్దులనూ దాటేస్తుంది. మనిషి తిరగేసి తలను పట్టుకుని హారతి ఇవ్వడమేంటి.. హెలికాఫ్టర్ రెక్కలను త్రిశూలం మీద పెట్టి తిప్పడమేంటి.. అదే త్రిశూలంతో మెషీన్ గన్నును ఆపరేట్ చేయడమేంటి.. ఇండియన్ ఆర్మీ వల్ల కానిది హీరో ఒక్కడే చేయడమేంటి.. ఒక్కడే చైనా మీదికి యుద్ధానికి వెళ్లి ఆ దేశ ఆర్మీ జనరల్ ను చంపడమేంటి.. అబ్బో మామూలు విన్యాసాలా అవి? మాస్ అంటే ఇంతే మరి.. వీటినే ఎంజాయ్ చేస్తాం అంటే సినిమా నిండా ఇలాంటి విన్యాసాలకు.. విధ్వంసాలకు లోటే లేదు. కానీ ఇవి వెటకారంగా తోస్తే మాత్రం ‘అఖండ-2’ ఒక ట్రోల్ స్టఫ్ లాగా అనిపిస్తుంది.
బాలయ్యతో చేసిన తొలి రెండు చిత్రాల్లో సగటు మాస్ కమర్షియల్ ఫార్ములాలే ప్రయత్నించాడు బోయపాటి శ్రీను. మూడో ప్రయత్నంలో మాత్రం ఆ ఫార్ములాకే కొంచెం డివైన్ టచ్ ఇచ్చాడు. బోయపాటి సినిమా అంటే ఇద్దరు బాలయ్యలు కామన్ కాగా.. ఈసారి రెండో బాలయ్యను పరమ శివభక్తుడైన అఘోరాగా మార్చి సినిమాకు కొత్త కలర్ తీసుకొచ్చాడు. కల్చర్.. డివైన్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు బాగా క్లిక్ అవుతున్న ట్రెండులో ‘అఖండ’ అద్భుత విజయాన్నందుకుంది. ఐతే అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అనేసరికి బోయపాటి అన్నీ డబుల్ డోస్ ఇచ్చేద్దామని ప్రయత్నించాడు. కానీ అది కాస్తా ఓవర్ డోస్ అయిపోయింది. ఇటు మాస్ సన్నివేశాలు శ్రుతి మించిపోయాయి. అటు డివైన్ ఎలిమెంట్లను వాడుకున్న తీరూ హద్దులు దాటిపోయింది. మొత్తంగా ‘అఖండ’లా ‘అఖండ-2’ ఒక ఆర్గానిక్ ఫీల్ తీసుకురావడంలో ఫెయిలైంది.
‘అఖండ-2’లో అతిగా అనిపిపిస్తూనే.. మాస్ ప్రేక్షకులను అలరించే ఎపిసోడ్లకేమీ లోటు లేదు. అఖండ పునరాగమనాన్ని చూపించే ఇంటర్వెల్ ఎపిసోడ్లో మాస్ ప్రేక్షకులకు.. బాలయ్య అభిమానులకు పూనకాలు ఖాయం. అఖండను హనుమంతుడు పూనే మరో యాక్షన్ ఎపిసోడ్ కూడా బాగానే పేలింది. మిగతా యాక్షన్ ఎపిసోడ్లను కూడా మాస్ మెచ్చేలా తీర్చిదిద్దారు. కానీ ఆయా ఎపిసోడ్లలో బలమైన ఎమోషన్ మాత్రం మిస్సయింది. అందుక్కారణం.. సినిమాలో బలమైన విలన్లు లేకపోవడం.. హీరోకు అసలు ఎదురే లేనట్లు చూపించడం. అన్ని తాంత్రిక విద్యలూ నేర్చుకుని పిశాచాలను వశపరుచుకున్నట్లు చెప్పే విలన్ భయంకరమైన అవతారంలో కనిపిస్తాడే కానీ.. అఖండ తనకు ఎదురొచ్చిన రెండుసార్లూ కనీసం నిలవజాలడు. ఇక చైనా ఆర్మీ చీఫ్ అండ్ కో వ్యవహారం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గన్నులు పట్టుకుని పదుల సంఖ్యలో రౌడీలు వచ్చినా.. తాంత్రిక విద్యలు తెలిసిన మాంత్రికుడొచ్చినా.. వందల మంది సైనికులతో కలిసి శత్రు దేశపు సైన్యాధ్యక్షుడు వచ్చినా.. జస్ట్ ఒక శూలం మాత్రమే చేతిలో ఉన్న అఖండ వీడియో గేముల్లో చంపినట్లు అందరినీ చంపుకుని పోవడమే ఉంటుంది. విలన్లను అంత వీక్ చేసి.. హీరోను మరీ అంత పీక్స్ లో చూపిస్తే.. ఇక కిక్కేముంటుంది?
బోయపాటి సినిమాల్లో కథలు.. అందులో లాజిక్కుల గురించి ఎక్కువ ఆశలు పెట్టుకోలేం. హీరోయిజం.. యాక్షన్ ఎపిసోడ్ల మధ్య మొక్కుబడిగా ఒక థ్రెడ్ ఏదో నడిపిస్తుంటాడతను. ‘అఖండ-2’ను పాన్ ఇండియా సినిమాగా మలిచే క్రమంలో కుంభమేళా.. అందులో ఒక వైరస్ అంటూ ఏదో కసరత్తు చేశాడు కానీ.. అది వర్కవుట్ కాలేదు. అది పూర్తిగా మిస్ ఫైర్ అయిందనే చెప్పాలి. సనాతన ధర్మం గురించి ఒక చోట డైలాగులైతే బాగున్నాయి కానీ.. దాని చుట్టూ సన్నివేశాలు కూడా ఓవర్ డోస్ అయినట్లే అనిపిస్తుంది. శివుడి ఎలిమెంట్ ‘అఖండ’లో మాదిరి ఆర్గానిక్ ఫీల్ ఇవ్వదు. పాన్ ఇండియా అప్పీల్ కోసం ‘అఖండ’ పరిధి పెంచే ప్రయత్నంలో ప్రతి విషయమూ హద్దులు దాటిపోయినట్లే అనిపిస్తుంది. అఖండ పాత్రతో ఫస్ట్ పార్ట్ లో ఉన్న ఎమోషనల్ కనెక్ట్ కూడా ఇక్కడ మిస్సయింది. యాక్షన్ సన్నివేశాల్లో ఆ పాత్రతో చేయించిన విపరీతమైన అతే అందుక్కారణం. ఓవరాల్ గా చెప్పాలంటే ‘అఖండ’లో ఉన్న సోల్ ‘అఖండ-2’లో మిస్సయింది. మాస్ అంశాలు ఓవర్ డోస్ అయిపోవడంతో ‘అఖండ-2’ ప్రేక్షకులకు సంతృప్తినివ్వడం కష్టమే. నటీనటులు: నందమూరి బాలకృష్ణ అఖండ పాత్రను మరోసారి ఓన్ చేసుకుని నటించాడు. పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. డైలాగుల విషయంలోనూ బాలయ్య మరోసారి అదరగొట్టాడు. కానీ వయసు మళ్లిన అఖండగా ఆయన లుక్ అంత బాగా లేదు. మేకప్ విషయంలో కొంచెం భిన్నంగా ప్రయత్నించాల్సింది. ‘అఖండ’ పార్ట్-1 లుక్ తో కనిపించే సన్నివేశాల్లో మాత్రం బాలయ్య ఆకట్టుకున్నాడు. మురళీకృష్ణ పాత్రలో బాలయ్య ఓకే అనిపించాడు. ఆ పాత్రకు జోడీగా నటించిన సంయుక్త ‘జాజికాయ’ పాటలో చాలా గ్లామరస్ కనిపించి కుర్రాళ్లను ఆకట్టుకుంది. బాలయ్య కూతురి పాత్రలో నటించిన హర్షాలీ మల్హోత్రా (భజరంగి భాయిజాన్ ఫేమ్) జస్ట్ ఓకే అనిపించింది. విలన్ పాత్రల్లో ఎవ్వరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. తాంత్రికుడి పాత్ర కోసం మేకప్ పరంగా ఆది పినిశెట్టి చాలా కష్టపడ్డాడు.. నటన కూడా ఓకే కానీ ఆ పాత్ర ప్రభావం మాత్రం అంతంతమాత్రమే. శశ్వత ఛటర్జీ.. చైనీస్ ఆర్మీ చీఫ్ గా చేసిన నటుడు చాలా మామూలుగా అనిపిస్తారు. ఠాకూర్ పాత్రలో కబీర్ సింగ్ దుల్హాన్ బాగానే చేశాడు. పీఎం పాత్రలో సర్వధామన్ బెనర్జీ పెద్దగా రాణించలేకపోయాడు. శరత్ లోహితశ్వ.. పూర్ణ.. మిగతా నటీనటులు ఓకే. సాంకేతిక వర్గం: తమన్ తనకు అలవాటైన రీతిలో వాయిద్యాల హోరుతో చెవుల తుప్పు వదలగొట్టేశాడు. అతడి పాటలు ఏమైనా వినిపిస్తే కదా అవి ఎలా ఉన్నాయో చెప్పడానికి? అఖండ పాత్ర విజృంభించే సమయాల్లో సంస్కృత శ్లోకాలను బీజీఎంలో వాడుకున్న తీరు బాగుంది కానీ.. చాలా చోట్ల అసలేం సౌండ్ వస్తోందో తెలియనట్లు మరీ శబ్దంతో విధ్వంసం సృష్టించడం మాత్రం టూమచ్. ఎక్కువ సంగీత పరికరాలు వాడి.. విపరీతమైన సౌండుతో ఊదరగొట్టడమే మాస్ మ్యూజిక్ అనే భ్రమ నుంచి అతను బయటికి వస్తే మంచిది. రామ్ ప్రసాద్.. సంతోష్ డెటాకే కలిసి అందించిన ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. భారీగా ఖర్చు పెట్టిన సంగతి తెరపై కనిపిస్తుంది. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. తన ఊర మాస్ టెంప్లేట్ నుంచి బయటికి రావాల్సిన అవసరాన్ని ‘అఖండ-2’ గుర్తు చేస్తుంది. కథ విషయంలో కానీ.. కథనం విషయంలో కానీ బోయపాటి నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా ఏమీ లేదు ఇందులో. మిగతా హీరోలతో సినిమాల సంగతెలా ఉన్నా.. బాలయ్య వరకు అతడి ఫార్ములాలు పని చేసేవి. కానీ ఈసారి బాలయ్యతోనూ అతడి మాస్ ఓవర్ డోస్ అయిపోయింది.
రేటింగ్ – 2.5/5













