జూన్ 12 అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం గురించి ఇప్పటివరకు వస్తున్న వార్తలు ఒక్కోటి.. అయితే దీనిపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) అందించిన ప్రాథమిక రిపోర్ట్ మరిన్ని వివరాలను బయటకు తీసింది. 15 పేజీల ఈ నివేదికలో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
AAIB తెలిపిన వివరాల ప్రకారం.. ఆ రోజు విమానం ప్రారంభమైన తర్వాత గరిష్ట వేగానికి చేరింది. అంతే కాకుండా ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్‌కు మారిపోయాయి. అంటే ఇంజిన్‌కు ఇంధనం అందే మార్గం కట్ అయింది అన్న మాట. ఇంజిన్-1, ఇంజిన్-2 రెండూ ఒక్కసారిగా ఆగిపోవటంతో విమానం గాలిలోనే నిలిచిపోయింది. దీనిని గమనించిన పైలట్లలో ఒకరు వెంటనే ‘‘ఇంజిన్లను ఎందుకు ఆఫ్ చేశావ్?’’ అని మరో పైలట్‌ని ప్రశ్నించారు. ‘‘నేను స్విచ్ ఆఫ్ చేయలేదు’’ అని సమాధానం ఇచ్చాడు. వీటన్నీ కాక్‌పిట్ రికార్డుల్లో నమోదు అయ్యాయని రిపోర్ట్ చెబుతోంది.
టేకాఫ్ అయిన వెంటనే ఇంధనం ఆగిపోవడంతో రాట్స్ (RAT) బయటకు వచ్చాయని, రెండు ఇంజిన్లను మళ్లీ రన్‌లో పెట్టినప్పటికీ ఇంజిన్-1 మాత్రమే రీ-స్టార్ట్ అయ్యిందని తెలిపారు. ఇంజిన్-2 పవర్ అందించలేకపోయింది. మధ్యాహ్నం 1:39కి పైలట్ మేడే కాల్ ఇచ్చినా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్పందించినప్పటికీ పైలట్లు తిరిగి రిప్లై ఇవ్వలేకపోయారని వివరించారు. కాస్త గాలిలో ముందుకు వెళ్లిన వెంటనే విమానం కాపౌండ్ బయట పడిపోవడమే జరిగిందని సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన తర్వాత స్పష్టం చేశారు. పక్షి ఢీకొన్న ఆనవాళ్లు ఏవీ లేవని AAIB తేల్చింది.
ప్రమాదానికి ముందు ఇంధనం సరిపడేలా ఉన్నట్టు, బరువు పరిమితుల్లోనే ఉన్నట్టు రిపోర్ట్ పేర్కొంది. ఏవైనా పేలుడు పదార్థాలు, ప్రమాదకర వస్తువులు విమానంలో లేవని కూడా స్పష్టంచేసింది. ఘటనలో రెండు ఇంజిన్లను పూర్తిగా బయటకు తీశామని, మరికొన్ని కాంపోనెంట్స్‌ను భద్రపెట్టామని AAIB అధికారులు తెలిపారు. ఫోటోలు, వీడియోలు పూర్తిగా పరిశీలించిన తర్వాత తుది నివేదికకు మరికొన్ని నెలలు పట్టవచ్చని అధికారులు వివరించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదని, ఎందుకు ఇలాంటి తప్పిదం జరిగిందో తేల్చడానికి అందరూ ఆగిపోతున్నారు. ఫైనల్ రిపోర్ట్‌లో అసలు కారణం ఇంకా స్పష్టమవుతుందా? అన్నది ఇప్పుడు దేశం మొత్తం ఎదురుచూస్తోంది.