జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం, టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే భయంకరమైన విషాదాన్ని మిగిల్చింది. గుజరాత్‌లోని మేఘనీనగర్ ప్రాంతంలో ఉన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ కూలిపోవడం వల్ల మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో 241 మంది మరణించగా, హాస్టల్ భవనంలో ఉన్న 34 మంది విద్యార్థులు, స్థానికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్ పౌరుడైన భారతీయ మూలాలు గల విశ్వాస్ కుమార్ రమేష్ (సీట్ 11A). అతను స్వల్ప గాయాలతో బయటపడడం అంతా అద్భుతమేనంటున్నారు అధికారులు.
చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి, 16 మంది చిన్నారులు, 120 మంది పురుషులు, 124 మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు 256 మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారు. ఈ విషాద ఘటనపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రమాదం వెనుక ఉన్న కారణాలు, ఏవైనా లోపాలున్నాయా అనే విషయాలపై మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఇక బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది. మృతుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం, గాయపడినవారికి పూర్తిగా వైద్య సహాయం అందించనున్నట్టు ప్రకటించింది. దేశ విమానయాన చరిత్రలో ఈ ప్రమాదం అతి భారీగా నిలిచిపోయింది. ప్రజల మనస్సుల్లో ఈ మిగిలిన శోకాన్ని మాటల్లో చెప్పలేము. ఒకవైపు భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తుండగా, మరోవైపు శాశ్వతంగా విడిపోయిన కుటుంబాల్లో బాధని మాత్రం ఎవరూ తీర్చలేరు.