ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకీ ఏఐ ప్రభావం విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఏఐ వల్ల చాలా మంది నిరుద్యోగులయ్యే అవకాశం ఉందనే చర్చా ఇటీవల బలంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర నివేదిక తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా… భారతదేశంలో దాదాపు సగం (47%) కంపెనీలు బహుళ జనరేటివ్ ఏఐని ఉత్పత్తిలో వినియోగిస్తున్నాయని తెలిపింది.
అవును… సుమారు సగం భారతీయ సంస్థలు (47 శాతం) ఇప్పుడు బహుళ జనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ) వినియోగిస్తున్నాయని ఈవై-సీఐఐ సంయుక్తంగా రూపొందించిన నివేదిక వెల్లడించింది. “ది ఏఐడియా ఆఫ్ ఇండియా: అవుట్ లుక్ 2026” పేరుతో ఈ నివేదికను రూపొందించారు. దీనికోసం 200 భారతీయ సంస్థల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు నివేదిక వెల్లడించింది.
ఈ 200 భారతీయ సంస్థల్లో.. ప్రభుత్వ రంగం సంస్థలతోపాటు స్టార్టప్ లు, గ్లోబల్ కేపపబులిటీ కేంద్రాలు, మల్టీ నేషనల్ కంపెనీల భారతీయ విభాగాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఊహించిన ఫలితాలను అందించడానికి భారతీయ సంస్థలు ప్రధాన వ్యాపార వర్క్ ఫ్లో లలో ఏఐని ఎక్కువగా పొందుపరుస్తునాయని చెబుతున్న నివేదిక.. ఏఐపై పెరుగుతున్న విశ్వాసాన్ని హైలెట్ చేస్తుంది.
ఈ క్రమంలో… 95% కంటే ఎక్కువ సంస్థలు మొత్తం ఐటీ వ్యయంలో 20% కంటే తక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) బడ్జెట్ లను నిర్వహిస్తున్నాయని.. ముఖ్యంగా 76% వ్యాపార నాయకులు జెనరేటివ్ ఏఐ గణనీయమైన వ్యాపార ప్రభావాన్ని చూపుతోందని నమ్ముతున్నారని.. ఇందులో 63% మంది దాన్ని వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నివేదిక పేర్కొంది.
ఈ క్రమంలో వచ్చే వచ్చే 12 నెలల్లో.. పెట్టుబడుల కార్యకలాపాలు (63%), వినియోగదారు సేవ (54%), మార్కెటింగ్ (33%)పై దృష్టి పెడతారని భావిస్తున్నారని తెలిపింది. అదేవిధంగా… ఏఐ కోసం కొనుగోలు వర్సెస్ బిల్డ్ వ్యూహాల్లో 91% మంది నిర్ణయాధికారులు వేగవంతమైన విస్తరణను అతి ముఖ్యమైన అంశంగా గుర్తించారని వెల్లడించింది.


















