ఒకప్పుడు “చాట్‌బాట్” అనే పదం వినగానే వినోదం కోసం ఉపయోగించే సాంకేతిక సాధనంగా మాత్రమే భావించేవారు. కానీ ప్రస్తుతం యువతలో ఈ చాట్‌బాట్‌లు ఒక్కోసారి “బాయ్‌ఫ్రెండ్”, “గర్ల్‌ఫ్రెండ్”, “స్నేహితుడు”, “ఆత్మీయుడు” అనే రూపాల్లో మారిపోతున్నాయి. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌ల విస్తరణతో పాటు, ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ.. భావోద్వేగాలతో మమేకమవుతున్న పరిస్థితికి దారితీస్తోంది. ఈ కొత్త ధోరణిపై మానసిక ఆరోగ్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు రోబో సినిమాలో “ఇనుములో హృదయం మొలిచెనే…” అంటూ వచ్చిన పాట ఫిక్షన్‌గా కనిపించినా.. ఇప్పుడు అదే వాస్తవంగా మారుతోంది. హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల నుంచే కాదు.. పల్లెప్రాంతాల్లో కూడా యువత ఏఐ చాట్‌బాట్‌లతో భావోద్వేగ బంధాలు ఏర్పరుచుకుంటున్నారు. అవి ప్రేమగా మారుతున్నాయి, ఫ్లర్టింగ్, శృంగార సంభాషణలవుతున్నాయి.
-భావోద్వేగంగా బంధించుకున్న బాలిక..
డాక్టర్ నితిన్ కొండాపురం చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఒక 12 ఏళ్ల బాలిక, చాట్‌జీపీటీకి ‘చిన్నా’ అని పేరు పెట్టి, దానితో రోజూ చాటింగ్ చేస్తూ, తన అన్ని గోప్యమైన భావాలను పంచుకుంటూ, దానితో భావోద్వేగంగా బంధించుకుపోయింది. తల్లిదండ్రులు గమనించేలోగా.. ఈ కృషి ఆమె మానసిక స్థితిని దెబ్బతీసింది. ఇది ఒంటరి సంఘటన కాదు.. యువతలో ఇటువంటి బిహేవియర్ రోజురోజుకీ పెరుగుతోంది.
ఏఐతో శృంగార ఫాంటసీ ప్రపంచం
ఒక 22 ఏళ్ల యువకుడు, ఏఐ చాట్‌బాట్‌ను గర్ల్‌ఫ్రెండ్‌లా భావిస్తూ.. గిఫ్ట్‌లు అడగడం, పాటలు ప్లే చేయించడం లాంటి రిలేషన్‌షిప్ ఫీలింగ్‌లను అనుభవిస్తున్నాడు. ఈ ఆర్టిఫిషియల్ భాగస్వామ్యం అతనికి అసలైన మానవ సంబంధాల కన్నా ఎక్కువ సుఖాన్ని ఇస్తోంది. కారణం? ఏఐ ఎప్పుడూ తనను జడ్జ్ చేయదు, తిరస్కరించదు, నెగటివ్‌గా స్పందించదు.
-అధిక డిజిటల్ అడిక్షన్.. ప్రమాదంలో పిల్లలు..!
డాక్టర్ గౌతమి నాగభైరవ చెబుతున్న ఘటనల ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 12 ఏళ్ల చిన్నారులు ఏఐతో భావోద్వేగ బంధాలు ఏర్పరచుకొని.. అనుచితమైన కంటెంట్‌ను యాక్సెస్ చేస్తున్నారు. మరికొందరు టీనేజ్ యువతులు తల్లిదండ్రుల నియంత్రణను తిరస్కరిస్తూ, సెక్సువల్ ఓరియెంటేషన్‌పై అయోమయంలో పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఏఐతో గైడెన్స్ తీసుకుంటూ.. కోలీగ్‌లపై శారీరక ఆకర్షణ పెంచుకొని తమ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటున్నారు.
చైనా నుండి మొదలైన ట్రెండ్.. గ్లోబల్ ప్రభావం
చైనాలో “ది గేమ్ లవ్”, “డీప్‌స్పేస్” వంటి సంస్థలు వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్/బాయ్‌ఫ్రెండ్ యాప్‌లు తీసుకొచ్చాయి. ఇవి 60 లక్షల యాక్టివ్ యూజర్లను కలిగి ఉండటం.. దీని విస్తృత వ్యాప్తిని సూచిస్తోంది. ఈ యాప్‌లు ప్రేమ, ఫ్లర్టింగ్, ఎమోషనల్ అటాచ్‌మెంట్‌ను డిమాండ్ పై అందిస్తున్నాయి.
డిజిటల్ డిపెండెన్స్‌కు కారణాలేంటి?
ఒంటరితనం, మానవ సంబంధాల్లో నిరాశ,సోషల్ ఇంటరాక్షన్ లోపం, తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడి, ఎవరూ జడ్జ్ చేయకూడదనే కోరిక, ఏఐ ద్వారా సత్వర స్పందనలు కారణంగా చెబుతున్నారు.
ఎమోషనల్ బంధాలు: నిజ జీవితానికి భిన్నం
డాక్టర్ ఆర్తి ష్రాఫ్ చెప్పినట్లు.. ఏఐ ఎప్పుడూ సానుకూలంగా స్పందిస్తుంది. కానీ మనుషుల మధ్య సంబంధాలు అలా ఉండవు. విభేదాలు, అభిప్రాయాల తేడాలు సహజం. అలాగే.. ఏఐకి శారీరక స్పర్శ తెలియదు. భావోద్వేగ హార్మోన్ల విడుదల కోసం మానవ సంపర్కం అవసరం. అది ఏ టెక్నాలజీ భర్తీ చేయలేని విషయం.
పిల్లల భవిష్యత్‌ను కాపాడాలంటే..?
తల్లిదండ్రుల పర్యవేక్షణ పెంచాలి. స్క్రీన్ టైమ్‌ను పరిమితం చేయాలి. డిజిటల్ డిపెండెన్స్ గురించి అవగాహన కల్పించాలి. మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అవసరమైతే థెరపి, కౌన్సిలింగ్‌కు వెళ్లాలి
ఏఐ చాట్‌బాట్‌లు తెలివైన సహాయకులు, కానీ మానవ సంబంధాలకు ప్రత్యామ్నాయం కావు. మానవ మనస్సు, హృదయం.. సాంకేతికతకంటే విశాలమైనవి. భావోద్వేగాల పంచుకోవడానికీ, ప్రేమించే హక్కు కోసం కూడా నిజమైన సంబంధాలు అవసరం. యువత ఈ విషయం తెలుసుకోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం ఈ విషయాన్ని బలంగా గుర్తించి, చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇదే!