ఆయన వైసీపీలో సీనియర్ నేత కిందనే లెక్క. పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నారు. హ్యాట్రిక్ ఎంపీగా కూడా రికార్డు క్రియేట్ చేశారు ఒక పెద్ద రాజకీయ కుటుంబ వారసుడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సిసలైన వారసుడు అయిన మిధున్ రెడ్డి మొత్తానికి బయటకు వచ్చారు. హాయిగా పైరగాలిని గుండె నిండా పీల్చుకుని ఆకాశం వైపు ఆనందంగా చూస్తూ తన సహచరులతో చేతులు కలిపి హుషారు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సోమవారం రాత్రి వేళ కాస్తా పొద్దు కుంగిన సమయంలో మిధున్ రెడ్డి బెయిల్ మీద రిలీజ్ కావడం అన్నది వైసీపీ శ్రేణులలో కట్టలు తెచ్చుకునే సంతోషాన్ని నింపిందని చెప్పాలంటున్నారు.
రాజమండ్రి ఏకంగా 71 రోజుల పాటు మిధున్ రెడ్డి ఉన్నారు. ఆయనను చూసేందుకు ఉత్తరాంధ్ర నుంచి మొదలెడితే రాయలసీమ దాకా అన్ని జిల్లాల నుంచి నేతలు అంతా తరలి వచ్చారు. ములాఖత్ ద్వారా ఆయనను దాదాపుగా వైసీపీ మొత్తం పార్టీ కలిసారు. ఇదంతా మిధున్ రెడ్డి మీద అభిమానంగా చెప్పుకోవాలి అదే సమయంలో పెద్దిరెడ్డికి వైసీపీలో ఉన్న పట్టు ఆయన పట్ల సీనియర్లు జూనియర్లు అంతా తేడా లేకుండా చూపించిన ప్రేమకు నిదర్శనం అని అంటున్నారు. ఇక చూస్తే సెప్టెంబర్ నెలలో ఒక నాలుగైదు రోజులు తాత్కాలిక బెయిల్ కింద బయటకు వచ్చి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మిధున్ రెడ్డి పాల్గొన్నారు. ఆ తరువాత ఆయన ఈ నెల 11న మళ్ళీ జైలుకి వెళ్ళిపోయారు. ఇలా ఇన్నేసి రోజులు జైలులో ఉన్నా మిధున్ రెడ్డి మాత్రం ఎక్కడా తగ్గలేదు అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రాజమండి ఎయిర్ పోర్టు దాకా అతి పెద్ద ర్యాలీగా మిధున్ రెడ్డిని వైసీపీ అభిమానులు అంతా తీసుకుని వెళ్ళి ఘనంగా వీడ్కోలు చెప్పారు. జక్కంపూడి బ్రదర్స్ ఈ ర్యాలీకి నాయకత్వం వహించడం విశేషం. మరో వైపు చూస్తే చాలా కాలానికి వైసీపీలో అయితే కొత్త ఉత్సాహం కనిపించింది అని అంటున్నారు. తమ నాయకుడిని రిలీజ్ చేశారు అని క్యాడర్ లీడర్ అంతా సంబరాలే చేసుకున్నారు.
మిధున్ రెడ్డి అయితే ఎక్కడా తగ్గలేదు అని అంటున్నారు. నిట్ట నిలువుగానే ఉంటూ తన జైలు జీవితాన్ని ఎదుర్కొన్నారు అని పార్టీ నేతలు అంటున్నారు. జైలు సంకెళ్ళు ఆయన ధైర్యానికి తెగిపోయాయని కామెంట్స్ చేస్తున్నారు. మిధున్ రెడ్డిలో ఏ మాత్రం భయం కానీ బాధ కాని కనిపించలేదని ఆయన వైసీపీకి ఇపుడు ఒక రోల్ మోడల్ గా మారారని అంటున్నారు. తెగించి పార్టీ కోసం పనిచేస్తే పోయేది ఏమీ లేదని మహా అయితే కొన్నాళ్ళు జైలు జీవితం తప్ప మరేమీ కాదని అంటున్నారు. మిధున్ రెడ్డి వైసీపీ కోటరీలో కీలకంగా ఉంటూ వచ్చారు. అలాంటి నాయకుడిని టచ్ చేయడం ద్వారా అవతల పక్షం ఏమి సాధించిందో తెలియదు కానీ వైసీపీ క్యాడర్ కి లీడర్ కి మాత్రం టన్నుల కొద్దీ ధైర్యాన్ని రెడ్డి గారు అందించారు అని అంటున్నారు. ఆయన మాదిరిగానే ఇక మీదట మిగిలిన వారు అంతా జోరు చేసి గేరు పెంచితే మాత్రం వైసీపీ ఫ్యాన్ ఫుల్ స్పీడ్ తో గిరగిరా తిరిగేయడం ఖాయమని అంటున్నారు.