బండ్ల గణేష్.. కమెడియన్ గా కెరియర్ మొదలుపెట్టిన బండ్ల గణేష్.. పలు చిత్రాలలో విలన్ గా, నటుడిగా ఈ మధ్య హీరోగా కూడా సినిమా చేసి తన కలను నెరవేర్చుకున్నారు. మరొకవైపు నిర్మాతగా పలు చిత్రాలు కూడా నిర్మించారు. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన.. సినిమా ఈవెంట్లలో పాల్గొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాదు అటు సోషల్ మీడియా ద్వారా కూడా ఏదో ఒక విషయంపై స్పందిస్తూ.. కాంట్రవర్సీ మాటలతో ట్రోల్స్ కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
నిజానికి ఎవరినైనా బండ్ల గణేష్ నమ్మారు అంటే వారిని దేవుడు కంటే ఎక్కువగా భావిస్తారు అన్న విషయం అందరికీ తెలుసు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్, చిరంజీవిలను దేవుడు కంటే ఎక్కువగా భావిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి ఈయన తాజాగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే టాప్ సెలబ్రిటీలకు తన ఇంట్లో చాలా గ్రాండ్ గా దీపావళి పార్టీ ఇచ్చారు. ముఖ్యంగా బండ్లన్న ఇచ్చిన ఈ దీపావళి పార్టీకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయగా.. హీరో శ్రీకాంత్ , వెంకటేష్, నిర్మాత నవీన్ ఎర్నేని, యంగ్ హీరోలు తేజా సజ్జ, సిద్దు జొన్నలగడ్డ , లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి తనూజ్ తో పాటు తదితరులు అగ్ర దర్శకులు, అగ్ర నిర్మాతలు ఈ ఈవెంట్ కి హాజరై ఈవెంట్ ను సక్సెస్ చేశారు.
ఇకపోతే ఈ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఈ పార్టీకి వస్తారని ముందే భావించిన బండ్ల గణేష్ ఆయన కోసం ప్రత్యేకంగా ఒక సింహాసనాన్ని కూడా తయారు చేయించారు . ఇక చెప్పినట్టుగానే మెగాస్టార్ చిరంజీవి.. బండ్ల గణేష్ ఇంటి ముందు కారు దిగగానే.. ఆయన కాళ్లు మొక్కి ఆయన చేయి పట్టుకొని మరీ వెళ్లి.. ఆ కుర్చీలో కూర్చోబెట్టారు బండ్ల గణేష్. ఇక ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. “మా బాస్ చిరంజీవి మా ఇంటికి వస్తారని.. ఆయనపై ప్రేమతో నేను ప్రత్యేకంగా ఒక సింహాసనం తయారు చేయించాను. ఆయన మా ఇంటికి వచ్చి.. ఆ సింహాసనంపై కూర్చోవడంతో నా మనసు ఉప్పొంగిపోయింది” అంటూ ట్విట్టర్ వేదికగా స్వయంగా బండ్ల గణేష్ తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తే బండ్ల గణేష్ కి చిరంజీవి అంటే ఎంత గౌరవం, ప్రేమ ఉందో అర్థం అవుతుంది.
ఇకపోతే ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బండ్లన్న ఇచ్చిన పార్టీ చాలా గ్రాండ్ గా ఉంది. ఈ పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టారో అంటూ అభిమానులు సైతం ఆరా తీయడం మొదలుపెట్టారు. అసలు విషయంలోకి వెళితే.. అతిథుల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసిన బండ్లను.. ఒక్కో ప్లేటు కోసం సుమారుగా 18 వేల నుండి 20వేల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక అరేంజ్మెంట్స్ మొదలుకొని ప్రతి ఒక్కటి చాలా గ్రాండ్ గా నిర్వహించిన బండ్ల గణేష్.. ఈ పార్టీ కోసం ఏకంగా రూ.1.5 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బండ్ల గణేష్ ఇచ్చిన ఈ పార్టీ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.















