ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన రాజకీయానికి పదును పెడుతున్నారు. గతానికి భిన్నంగా ఇపుడు ఆమె ఏపీలో టీడీపీ కూటమి మీద తీవ్ర విమర్శలే చేస్తున్నారు. వైసీపీని ఒక వైపు టార్గెట్ చేస్తూనే కూటమిని కార్నర్ చేయడం ద్వారా ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి గట్టిగానే చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో మెల్లగా మారుతున్న రాజకీయాన్ని కూడా ఆమె గమనంలోకి తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఏపీలో చూస్తే ప్రస్తుతానికి ఏకైక బలమైన ప్రతిపక్షంగా వైసీపీ ఉంది. ఇక తరువాత స్థానంలో దూసుకుని రావాలని షర్మిల వ్యూహ రచన చేస్తున్నారు.
నవంబర్ నెలలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఈసారి హోరా హోరీ పోరు సాగే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఎడ్జ్ మాత్రం ఇండియా కూటమికి ఉండొచ్చు అని అంటున్నారు. మరో వైపు చూస్తే రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర కూడా బీహార్ ఓటర్లను మెప్పించింది అని అంటున్నారు. తాజాగా జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ గురి కూడా బీహార్ మీదనే పెట్టారు. ఇక ప్రియాంక తొందరలో హర్ ఘర్ అధికార్ పేరుతో యాత్ర చేపడుతున్నారు. మొత్తం మీద బీహార్ ఎన్నికలతో కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుంటుంది అన్న ఆశాభావం అంతా వ్యక్తం చేస్తున్నారు. దాంతో నవంబర్ మూడో వారంలో ఎన్నికలు జరిగి ఫలితాలు వస్తాయని అంటున్నారు. దాని కోసం షర్మిల వెయిట్ చేస్తున్నారు అని అంటున్నారు.
ఉత్తరాదిన హిందీ బెల్ట్ లో ఒక కీలకమైన పెద్ద రాష్ట్రం బీహార్ లో కనుక కాంగ్రెస్ కూటమి గెలిస్తే ఇక జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కి అనుకూల వాతావరణానికి దారులు తెరచుకున్నట్లే అని భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇవి జనంలోకి బలంగా వెళ్తున్నాయి. ఇంకో వైపు చూస్తే కనుక కాంగ్రెస్ గ్రాఫ్ కూడా నెమ్మదిగా దేశంలో పెరుగుతున్న వాతావరణం కనిపిస్తోంది బీహార్ కనుక ఎన్డీయేను ఓడించి కాంగ్రెస్ కూటమి హస్తగతం చేసుకుంటే చాలా వేగంగా జాతీయ స్థాయిలో మార్పులు వస్తాయని అంతా భావిస్తున్నారు. ఇక దాని ప్రభావం ఏపీ మీద కూడా పెద్ద ఎత్తున పడుతుంది అని షర్మిల చూస్తున్నారు అని అంటున్నారు.
బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆ తరువాత రాహుల్ గాంధీని ఏపీకి రప్పించి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయించాలని షర్మిల చూస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఏపీ కాంగ్రెస్ లో కూడా స్తబ్దత తొలగిపోయి కొత్త ఉత్సాహం వస్తుందని అంటున్నారు. అంతే కాకుండా ఎన్ డీయే వ్యతిరేక ఓటు బ్యాంక్ ని న్యూట్రల్ సెక్షన్స్ కి మైనారిటీలు ఎస్సీ ఎస్టీ వర్గాలను తిరిగి కాంగ్రెస్ వైపు నడిపించేందుకు కూడా మార్గం సుగమం అవుతుందని షర్మిల భావిస్తున్నారు అని అంటున్నారు.
ఏపీలో అన్ని పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్డీయే కూటమికి మద్దతుగా నిలుస్తున్న క్రమంలో ఎన్డీయే వ్యతిరేక భావజాలాన్ని ఓడిసిపట్టుకోవాలని షర్మిల చూస్తున్నారు అని అంటున్నారు. రాహుల్ సభ తరువాత ఏపీలో కాంగ్రెస్ కార్యకలాపాలను ఉధృతం చేయాలని చూస్తున్నారు. బీహార్ లో కనుక కాంగ్రెస్ విజయం సాధిస్తే ఏపీలో కూడా కాంగ్రెస్ వైపు వచ్చే నాయకుల సంఖ్య బాగా పెరుగుతుందని అది పార్టీకి బూస్ట్ ఇస్తుందని కూడా ఆలోచిస్తున్నారుట. మొత్తానికి ఏపీలో కాంగ్రెస్ ని ఫోర్ ఫ్రంట్ లోకి తీసుకుని వచ్చేందుకు షర్మిల మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు అని అంటున్నారు.