ముఖ్యమంత్రి చంద్రబాబు మరో రికార్డు సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యధికాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి రికార్డు తనే సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా 15 ఏళ్లు సీఎంగా పనిచేసిన తొలి తెలుగు నాయకుడిగా అవతరించారు. అంతేకాదు దక్షిణాదిలో అత్యధికాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి, రంగస్వామి సరసన చేరారు. తెలుగు నేలపై జన్మించిన ఏ నాయకుడు 15 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగకపోవడం విశేషం. ప్రస్తుతానికి ఈ ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కింది.
ఉమ్మడి రాష్ట్రమైనా, ప్రస్తుత విభజిత రాష్ట్రమైనా చంద్రబాబునాయుడు మాత్రమే అత్యధిక కాలం సీఎంగా కొనసాగగలిగారు. 1995 సెప్టెంబరు 1న తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు, 1999లో జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచి సీఎం గా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత 2004లో చంద్రబాబు పదవీకాలం పూర్తవగా అప్పట్లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి సీఎం పీఠం వదులుకోవాల్సివచ్చింది. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత మరోసారి చంద్రబాబు నాయకత్వాన్ని ఏపీ ప్రజలు కోరుకున్నారు. అదేవిధంగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ ఘన విజయం కట్టబెట్టారు. ఇలా నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబు ఈ రోజుతో సీఎంగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ విడతలో ఇంకా సమయం ఉండటంతో ఆయన సీఎంగా 19 ఏళ్లు పనిచేసే అవకాశం ఉంది.
అతిసామాన్య కుటుంబం నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన చంద్రబాబు.. తెలుగునేలపై ఏ నేత సాధించని అరుదైన విజయాలు అందుకున్నారు. రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడు చంద్రబాబు మాత్రమే గట్టెక్కంచగలరని నమ్మకాన్ని చూరగొన్నారు. అందుకే 2014లో ఒకసారి, గత ఏడాది రెండోసారి సీఎంగా చంద్రబాబు గెలిచారని విశ్లేషిస్తున్నారు. ఇక దేశంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఎందో ఉన్నప్పటికీ ఈ ఘనత సాధించిన వారిలో దక్షిణాది నేతలు తక్కువనే చెప్పాలి. ద్రవిడ నాట కరుణానిధి, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రంగస్వామి మాత్రమే 15 ఏళ్లకు పైబడి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఎంజీ రామచంద్రన్, ఈకే నయనార్, జయలలిత, రామక్రిష్ణ హెగ్డే, ఎన్టీఆర్ వంటి మహామహులకు కూడా ఇంతటి అవకాశం దక్కలేదని చెబుతున్నారు.
ఇక తెలుగు నేలపై ముఖ్యమంత్రులు అయిన వారిలో అత్యధికాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డు ఇప్పట్లో ఎవరూ చేరుకునే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఈ రోజుతో 15 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు తర్వాత ఎక్కువ కాలం పనిచేసిన తెలుగు వారిలో కాసు బ్రహ్మానందరెడ్డి రెండోస్థానంలో ఉన్నారు. ఆయన ఏడేళ్ల 21 రోజులు సీఎంగా పనిచేశారు. మూడో స్థానంలో ఎన్టీఆర్ నిలిచారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడుగా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే చారిత్రక విజయాన్నిఅందుకున్న ఎన్టీఆర్ మూడు విడతల్లో కలిపి 7 ఏళ్ల 194 రోజులు సీఎంగా ఉన్నారు. నాలుగో స్థానంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 5 ఏళ్ల 111 రోజులు, ఐదో స్థానంలో నీలం సంజీవరెడ్డి 5 ఏళ్ల 51 రోజలు సీఎంగా కొనసాగారు.