నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ హనీ రోజ్. ఈ మలయాళీ ముద్దుగుమ్మ అంతకు ముందు మలయాళంలో చాలా సినిమాలు చేసింది. కానీ తెలుగులో మాత్రం పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయింది. కానీ వీర సింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సమయంలోనే తెలుగులో ఈమెకు రెండు మూడు ఆఫర్లు వచ్చాయి. కానీ వాటిని సున్నితంగా ఈ అమ్మడు తిరస్కరించింది అంటూ ప్రచారం జరిగింది. అది ఎందుకు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కేవలం తెలుగు సినిమాలను మాత్రమే కాకుండా మలయాళ, తమిళ సినిమాలను సైతం ఆ సమయంలో హనీ రోజ్ తిరస్కరించింది. ఎట్టకేలకు హనీ రోజ్ నుంచి ‘రేచల్’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
హనీ రోజ్ గత ఏడాదిలో ఒక్క సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేక పోయింది. 2023 నుంచి ఇప్పటి వరకు హనీ రోజ్ ప్రేక్షకులకు దూరంగా ఉంది. ఈ ఏడాది చివర్లో అంటే దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రేచల్ సినిమాతో హనీ రోజ్ ప్రేక్షకులను పలకరించబోతుంది. మలయాళంలో రూపొందిన రేచల్ సినిమాకు ఆనందిని బాలా దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈసినిమాను కేవలం మలయాళంలోనే కాకుండా తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లుగానే పాన్ ఇండియా రేంజ్ ప్రమోషన్స్ జరుగుతున్నాయని, అంతే కాకుండా అన్ని భాషలకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరిగినట్లుగా కూడా చిత్ర యూనిట్ సభ్యులు మీడియా వర్గాల వారికి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు.
హనీ రోజ్ కి మలయాళంలో మంచి గుర్తింపు ఉంది. కనుక రేచల్ సినిమాకు అక్కడ మినిమం ఓపెనింగ్ రావడం ఖాయం. తెలుగులో ఒకే ఒక్క సినిమాతో ఈమె వచ్చింది. అది కూడా దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది. కనుక ప్రేక్షకులు ఈమెను దాదాపు మరిచి పోయినట్లే అంటున్నారు. ఇలాంటి సమయంలో ఈమె వచ్చి నా సినిమాను చూడండి అంటే ఎంత వరకు రేచల్ కి తెలుగులో మార్కెట్ క్రియేట్ అవుతుంది అనేది చాలా పెద్ద ప్రశ్నగా ఉంది. రేచల్ కనుక తెలుగులో మంచి టాక్ సొంతం చేసుకున్నా కూడా వసూళ్లు ఏ మాత్రం వస్తాయి అంటే చెప్పలేని పరిస్థితి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హీరోయిన్ ఓరియంటెడ్ యాక్షన్, థ్రిల్లర్ సినిమాలకు ఏమాత్రం వసూళ్లు నమోదు అవుతాయి అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. అందుకే హనీ రోజ్ కి పాన్ ఇండియా మార్కెట్ సాధ్యమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ మధ్య కాలంలో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా కంటెంట్ బాగుంటే సినిమాలు ఆడేస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా, నటీ నటులు, సాంకేతిక నిపుణులతో సంబంధం లేకుండా సినిమాను కంటెంట్ బాగుంటే చూసేందుకు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. అలాంటి కంటెంట్ మా సినిమాలో ఉంది అంటూ హనీ రోజ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇంకా హనీ రోజ్ మాట్లాడుతూ… కొన్ని కారణాల వల్ల చిన్న గ్యాప్ అయితే వచ్చింది. అయితే రీ ఎంట్రీ కోసం మంచి కథను వెతుకుతున్న సమయంలో ఈ కథ వచ్చింది. కథ విన్న వెంటనే ఇంతకు మించి మంచి కథతో ఎంట్రీ ఇవ్వడం సాధ్యం కాదు అన్నట్టుగా చెప్పుకొచ్చింది. దాంతో సినిమాను వెంటనే చేసేందుకు కమిట్ అయ్యాను, తప్పకుండా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఆకట్టుకుంటుంది అనే విశ్వాసంను హనీ రోజ్ వ్యక్తం చేసింది. ఇటీవల విడుదల చేసిన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తూ సినిమాపై అంచనాలు పెంచింది.


















