నవంబర్ 10న దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ పేలుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ దారుణ ఘటనలో 12 మంది మరణించగా.. సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై భారత ప్రభుత్వం కఠిన విచారణకు ఆదేశించగా దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
భారతదేశంలో జరిగిన ఈ పెద్ద ఘటనపై పాకిస్థాన్ మీడియా కూడా విస్తృతంగా దృష్టి సారించింది. డాన్, జియో న్యూస్, ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్, ది న్యూస్ ఇంటర్నేషనల్, పాకిస్థాన్ టుడే వంటి ప్రముఖ పత్రికలు, న్యూస్ ఛానెళ్లు ఈ వార్తను తమ ప్రధాన పేజీల్లో ప్రచురించాయి. అన్ని నివేదికల్లోనూ ఉగ్రవాద కోణంపైనే ప్రధానంగా దృష్టి సారించడం గమనార్హం.
డాన్ పత్రిక ఈ వార్తను “దిల్లీలో ఎర్రకోట వద్ద పేలుడు.. ఎనిమిది మంది మృతి” అనే శీర్షికతో ప్రచురించింది. తరువాతి సంచికలో దిల్లీ పోలీసులు విచారణ ఉగ్రవాద నిరోధక చట్టం కింద జరుగుతోందని వెల్లడించినట్లు పేర్కొంది, అలాగే ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారని నివేదించింది. జియో న్యూస్, ది న్యూస్ ఇంటర్నేషనల్ సంస్థలు కూడా “దిల్లీ పేలుడుపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద దర్యాప్తు” అనే శీర్షికతో కథనాలు ప్రచురించాయి. ఇక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ “దిల్లీ ఎర్రకోట వద్ద అనుమానాస్పదంగా కారులో పేలుడు” అని రాసి, ఘటన తరువాత ముంబయి, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించబడిందని పేర్కొంది. పాకిస్థాన్ టుడేలో పేలుడు జరిగిన కారు యజమాని సల్మాన్‌ను భారత పోలీసులు అరెస్టు చేశారని, అతనికి కొన్ని ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయని తమ కథనంలో ప్రత్యేకంగా పేర్కొంది.
ప్రస్తుతం ఈ ఘటనపై ఉగ్రవాద నిరోధక విభాగం (NIA), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), ఫోరెన్సిక్ టీమ్స్ సంయుక్తంగా దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. ప్రాథమిక నివేదికల్లో ఈ పేలుడు వెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ ప్రమేయం ఉన్నట్లు సూచనలు ఉన్నాయని సమాచారం. చాలా ఏళ్లుగా పెద్ద పేలుడు ఘటనలు లేకుండా ప్రశాంతంగా ఉన్న భారత రాజధానిలో అందునా ఎర్రకోట వంటి చారిత్రాత్మక ప్రదేశం సమీపంలో ఈ ఘటన జరగడం భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలను లేవనెత్తింది.
భారతదేశంలో జరిగిన ఈ దారుణ ఘటనపై పాక్ మీడియా కవరేజ్, రెండు దేశాల మధ్య ఉన్న సంవేదనశీల సంబంధాలను ప్రతిబింబిస్తోంది. ప్రతి పాక్ మీడియా సంస్థ ఉగ్రవాద కోణంలోనే విశ్లేషించడంతో ఈ పేలుడు భవిష్యత్తులో మరిన్ని రాజకీయ, భద్రతాపరమైన చర్చలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
సోమవారం రాతి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ బాంబు పేలుడు మారణ హోమం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది దీని వెనక ఎవరు ఉన్నారు, దేని కోసం చేశారు ఇలాంటి విషయాల మీదనే అందరి దృష్టి ఉంది. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ లో పన్నెండు మంది దాకా చనిపోయారు. అనేక మంది తీవ్ర గాయాల పాలు అయ్యారు. అయితే ఆదివారం కనుక ఈ తరహా బాంబ్ బ్లాస్ట్ జరిగి ఉంటే కనుక పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించి ఉండేది అన్నది వాస్తవం. ఇదే మాటను అంతా అనుకున్నారు. సోమవారం ఎర్ర కోట సందర్శనకు సెలవు కావడంతో చాలా ప్రాణ నష్టం తప్పింది అని కూడా అనుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తీరుని పరిణామాలను అన్నీ బేరీజు వేసుకుంటూ లోతైన దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థలు ఒక విషయంలో కొంత మేర నిర్ధారణకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అదేంటి అంటే మొదట అనుకున్నట్లుగా ఇది సూసైడ్ ఎటాక్ అయితే కాదని, అంటే ఆత్మాహుతి దళంగా మారి చేసే దాడి అన్న మాట. నిజంగా అంతలా ప్రిపేర్ అయి వస్తే మాత్రం భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగేది అని అంటున్నారు. కానీ ఇక్కడ జరిగింది కొంత భిన్నంగా ఉందని దాంతోనే పెద్ద ముప్పు తప్పిపోయిందని అంటున్నారు.
ఈ భారీ బాంబ్ బ్లాస్ట్ ని చూస్తూ మొత్తం పరిణామాలను అంచనా వేస్తున్న నిపుణులు భావిస్తున్నది ఏమిటి అంటే ఇది ఒత్తిడితోనో లేక తొందరపడి చేసిన దాడిగానే అంటున్నారు. ఆ మేరకు దర్యాప్తు సంస్థలు ఒక అంచనాకు వస్తున్నట్లుగా చెబుతున్నారు. దేశంలో ఒక వైపు ఉగ్రవాద లింకుల మీద వాటితో అనుసంధానం అయిన వారి మీద వ్యక్తులు సంస్థల మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది ఉగ్ర వాద వ్యతిరేక సంస్థ. అధికారులు అయితే ఇదే పని మీద గత కొద్ది రోజులుగా బిజీగా ఉండడమే కాదు, లోతుల్లోకి వెళ్లి మరీ ఉగ్ర మూలాలను పెకిలించి వేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఉగ్ర వాదులతో కనెక్షన్లు ఉన్న వారు అంతా చెల్లా చెదురు అవుతున్నారు.
ఈ నేపధ్యంలో ఢిల్లీలో జరిగిన కారు బాంబు బ్లాస్టింగ్ లో నిందితుడు రెగ్యులర్ ఫార్ములాను వాడలేదని అలా కనుక చేస్తే భారీ ముప్పు జరిగి ఉండేదని అంటున్నారు ఒత్తిడి వల్ల తాను దొరికిపోతాను అన్న కంగారు వల్లనే ఈ విధంగా చేసి ఉండొచ్చు అని ప్రాధమిక అంచనాల మేరకు భావిస్తున్నారు. అంతే కాదు ఇంటెన్షన్ తో దేనినీ ఢీ కొట్టలేదని అంతే కాదు పూర్తిగా డెవలప్ కాని బాంబుని వాడడం వల్లనే తీవ్రత అయితే బాగా తగ్గింది అని అంటున్నారు. ఏది ఏమైనా ఉగ్ర లింకులు ఉన్న నిందితుడే ఈ పని చేశారు అన్నది వాస్తవం అని చెబుతున్నారు. దాంతో దీని వెనక ఏమి జరిగింది అన్నదే ఇపుడు కీలకంగా మారబోతోంది.


















