విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ సదస్సుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు నెలలుగా ఈ కార్యక్రమంపై పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇక రెండు రోజుల సదస్సుకు ఒక రోజు ముందుగానే ప్రభుత్వం విశాఖ తరలివెళ్లిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రులు, సీఎస్ విజయానంద్ ఆధ్వర్యంలో సీనియర్ బ్యూరోక్రాట్లు అంతా ప్రస్తుతం విశాఖలోనే ఉన్నారు. రేపు, ఎల్లుండి భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ నిర్వహణకు ఏర్పాటు చేయగా, ఈ రోజు విశాఖ నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పలు ఎంవోయూలు కుదుర్చుకుంది. ఇందులో 82 వేల కోట్లు పెట్టుబడికి ముందుకు వచ్చిన రెన్యూ పవర్ తోపాటు మరో 34 సంస్థలు ఉన్నాయి.
ఇక రెండు రోజుల సిఐఐ సమ్మిట్ కు ఆంధ్రా వర్సిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దేశ, విదేశాల నుంచి అతిథులు వస్తుండటంతో నగరంలో రోడ్లు అన్నింటిని ముస్తాబు చేశారు. రోడ్డు పక్కన ఉన్న గోడలకు పెయింటింగు వేయడంతోపాటు ఎక్కడ చూసినా పచ్చదనం-పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సదస్సు ప్రారంభవుతుంది. ఈ కార్యక్రమం నిమిత్తం రాష్ట్రానికి చెందిన మంత్రులతోపాటు కేంద్ర మంత్రులు రామ్మోహననాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ విశాఖలో తిష్టవేశారు.
కాగా, రెండు రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సుపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేసింది. ఏపి బ్రాండ్ ఇమేజ్ ప్రపంచానికి చాటి చెప్పేలా దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబై హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి మెట్రో నగరాల్లో ప్రధాన కూడళ్లు, విమానాశ్రయాల్లో హోర్డింగులు, డిజిటల్ డిసిప్లే బోర్డులు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ముఖ్య నగరాలు, పట్టణాల్లో కూడా భారీ హోర్డింగులు నెలకొల్పింది. ముఖ్యంగా విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నగరమంతా సీఐఐ సదస్సుకు సంబంధించి హోర్డింగులు, అందమైన పెయింటింగులతో ప్రత్యేక కళ తీసుకొచ్చారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్షం వైసీపీ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తోందని అంటున్నారు. పెట్టుబడులు పేరుతో పెద్ద ఎత్తున విదేశీ పర్యటనలు చేసిన కూటమి పెద్దలు ఎంతవరకు సఫలమయ్యారో తేలిపోనుందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో సీఐఐ సదస్సులో రాష్ట్ర యువతలో కూడా భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. గూగుల్ డేటా సెంటర్ తోపాటు రాష్ట్రానికి భారీ పరిశ్రమలు తరలిరానున్నాయనే ప్రచారాన్ని నమ్ముతున్న యువత.. ఆచరణలో ప్రభుత్వం ఎంతవరకు మాట నిలబెట్టుకుంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఏపీలో ప్రతి ఒక్కరి అటెన్షన్ విశాఖపై ఉందని అంటున్నారు.


















