ఓడి గెలవటం అన్న మాట తరచూ క్రీడల్లో వింటుంటాం. ఆ తరహా క్రెడిట్ కోసం గులాబీ పార్టీ జూబ్లీహిల్స్ ఉప పోరు వేళ ప్లాన్ చేసిందా? అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జూబ్లీ ఉపపోరుకు సంబంధించి కీలకమైన పోలింగ్ వేళ.. అధికార కాంగ్రెస్ అధిక్యత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తే.. నియోజకవర్గంలో తనకున్న పట్టును ప్రదర్శించే విషయంలో గులాబీ పార్టీ చేజార్చుకున్నట్లుగా కనిపించింది. ఇదే విషయాన్ని పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ సంస్థలు వెలువర్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్పష్టం చేశాయి.
జూబ్లీ ఉపపోరు పోలింగ్ ఆద్యంతం ప్రశాంత వాతావరణంలో సాగినప్పటికి.. పోలింగ్ ముగిసే సమయంలో మాత్రం అనూహ్య పరిణామాలు చోటు చేసుుకోవటం గమనార్హం. పోలింగ్ వేళ అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందని.. దొంగ ఓట్లు వేయిస్తుందని పేర్కొంటూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టటం.. అనంతరం ఒక పోలింగ్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పోలింగ్ పూర్తయ్యే సమయానికి యూసఫ్ గూడలోని కాంగ్రెస్ అభ్యర్థికి చెందిన పార్టీ కార్యాలయం వద్ద వెయ్యి మందికి పైగా స్థానికేతరులు ఉన్నారని.. వారితో దొంగ ఓట్లు వేయించినట్లుగా పేర్కొంటూ ఆందోళన షురూ చేశారు.
అప్పటికే తమ మీద అదే పనిగా ఆరోపణలు చేయటం.. ప్రతి మీటింగ్ లోనూ రౌడీ.. రౌడీ.. అంటూ తమ అభ్యర్థిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు.. బీఆర్ఎస్ అభ్యర్థితో పాటు.. ఆ పార్టీకి చెందిన నేతలు పలువురు కలిసి చేస్తున్న ఆందోళన వేళ.. అంతే దూకుడుగా స్పందించారు. దీంతో.. ఒక్కసారిగా వాతావరణం మారిపోవటమే కాదు.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదంతా ఎందుకన్న అంశాన్ని ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత కాంగ్రెస్ నేతలు కొందరికి అర్థమైంది.
ఊహించని విధంగా ఓటమి పలుకరించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్న వేళ.. తమకు ఎదురైన ఓటమి కాంగ్రెస్ కున్న అధికారం కారణమే తప్పించి.. ఓటర్లు తమను ఓడించలేదన్న భావన కలిగేలా చేసేందుకే ఈ హడావుడి చేశారన్న మాట బలంగా వినిపించింది. అయితే.. గులాబీ పార్టీ మైండ్ గేమ్ ను సరైన రీతిలో కాంగ్రెస్ అర్థం చేసుకొని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నువ్వెంత? అంటూ రెచ్చగొడితే.. అంతేలా రెచ్చిపోవటంలో అర్థం లేదన్న విషయాన్ని అధికార పార్టీ గుర్తించి ఉంటే బాగుండేదంటున్నారు. ఏమైనా.. పోలింగ్ చివర్లో గులాబీ పార్టీ మైండ్ గేమ్ ను అర్థం చేసుకోవటంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యిందన్న మాట బలంగా వినిపిస్తోంది.


















