దుర్మార్గమైన ప్లాన్ తో అమాయకుల ప్రాణాలు తీసిన జమ్ముకశ్మీర్ ఉగ్ర వైద్యుడి ఇంటిని భద్రతా దళాలు గురువారం రాత్రి పేల్చేశాయి. ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు దేశ వ్యాప్తంగా షాక్ కు గురి చేసింది. ఈ ఉగ్రదాడిలో పదమూడు మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎర్రకోట వద్ద పేలుడు చోటు చేసుకున్న కారును నడిపిన ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ అన్న సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్ లోని పుల్వామాకు చెందిన అతడి ఇంటిని గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఇంటిని భద్రతా దళాలు పేల్చేశాయి.
ఢిల్లీ పేలుడుపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఉమర్ ఇంటిని ధ్వంసం చేశారు. హ్యుందాయ్ ఐ2 కారు కారణంగానే ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న పేలుడుకు కారణమని తేలింది. కారు నడిపింది వైద్యుడిగా వ్యవహరించే ఉమర్ గా గురతించారు. ఈ ఆత్మాహుతి దాడిలో అతడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు నిర్ధారించారు. అతడి కుటుంబ సభ్యులతో కలిసి డీఎన్ఏ పరీక్షలు జరపగా.. పేలుడు వేళ కారుని నడిపింది ఉమర్ నబీనేనని తేల్చారు.
హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉగ్ర మాడ్యూల్ ను అధికారులు ఛేదిస్తున్న వేళలోనే ఈ ఉగ్రపేలుడు జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ మాడ్యుల్ కు సంబంధించి ఉమర్ కు కూడా లింకులు ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తంగా పలువురు అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకున్న ఉగ్రవాది ఇంటిని భద్రతా దళాలు పేల్చేయటం చూసినప్పుడు.. రానున్నరోజుల్లో ఉగ్రవాదుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.


















