బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మంగళవారం రెండో దశ పోలింగ్ జరగగా, మొదటి దశ పోలింగ్ నవంబర్ 6న పూర్తయింది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి.ఈ ఎన్నికలు అధికార ఎన్డీఏ, మహాఘట్‌బంధన్ మధ్య కీలకమైన పోటీగా మారాయి. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్‌సురాజ్ పార్టీ మొదటిసారిగా పోటీ చేస్తోంది.పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి కొన్ని సంస్థలు. వీటిలో చాలా ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని పేర్కొంటున్నాయి.మ్యాట్రిజ్-ఐఏఎన్ఎస్ ఎగ్జిట్ పోల్.. ఎన్డీఏ కూటమి 147-167 సీట్లు, మహాఘట్‌బంధన్ 70-90 సీట్లు, ఇతరులు 2-6 సీట్లు గెలుచుకోనున్నాయని పేర్కొంది.
ఇందులో బీజేపీకి 65-73 సీట్లు, జేడీయూకి 67-75 సీట్లు, ఎల్జేపీ (ఆర్)కి 7-0 సీట్లు, హెచ్ఏఎంకి 4-5 సీట్లు, ఆర్ఎల్ఎంకి 1-2 సీట్లు వస్తాయని పోల్ చెప్పింది.ఇక మహాఘట్‌బంధన్‌లోని ఆర్జేడీకి 53-58 సీట్లు, కాంగ్రెస్‌కు 10-12 సీట్లు, వీఐపీకి 1-4 సీట్లు, వామపక్షాలకు 9-14 సీట్లు వస్తాయని చెప్పింది.ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఎన్డీఏకు 48 శాతం ఓట్లు, మహాకూటమికి 37 శాతం ఓట్లు వస్తాయని అంచనా.
చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్, ఎన్డీఏకి 130-138 సీట్లు, మహాఘట్‌బంధన్‌కు 100-108 సీట్లు, ఇతరులకు 3-5 సీట్లు వస్తాయని అంచనా వేసింది.దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఎన్డీఏ 145-160 సీట్లు, మహాఘట్‌బంధన్ 73-91 సీట్లు వస్తాయని అంచనా.పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఎన్డీఏ 133-159 సీట్లు, మహాఘట్‌బంధన్ 75-101 సీట్లు గెలుచుకుంటుంటని అంచనా.పీపుల్స్ ఇన్‌సైట్ ఎగ్జిట్ పోల్, ఎన్డీఏ కూటమి 133-148 సీట్లు, మహాఘట్‌బంధన్ 87-102 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది.ఎగ్జిట్ పోల్స్, తుది ఫలితాల మధ్య వ్యత్యాసాలు ఉండొచ్చు. కాబట్టి, ఇవి తుది ఫలితాలు కావని అర్థం చేసుకోవడం ముఖ్యం.
ఎన్డీఏ కూటమిలో ఐదు పార్టీలున్నాయి. బీజేపీ, జేడీయూలు చెరో 101 సీట్లలో పోటీ చేస్తున్నాయి. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29 సీట్లలో, రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం), హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) చెరో 6 సీట్లలో పోటీ చేస్తున్నాయి.మరోవైపు, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్), సీపీఐ, వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)లతో కూడిన మహాఘట్‌బంధన్ తమ కూటమిలో ఎవరికెన్ని సీట్లు అనేది అధికారికంగా ప్రకటించలేదు.అయితే.. ఆర్జేడీ 143 సీట్లలో, కాంగ్రెస్ 61 సీట్లలో, సీపీఐఎంఎల్ 20 సీట్లలో, వీఐపీ 13 సీట్లలో, సీపీఐ(ఎం) 4 సీట్లలో, సీపీఐ 9 సీట్లలో పోటీ చేశాయి.
బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ఏదైనా పార్టీ లేదా కూటమికి 122 సీట్లు ఉండాలి.ప్రస్తుతం, బిహార్‌లో జేడీయూ, బీజేపీ భాగస్వామ్య పక్షాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.ప్రస్తుతం, బిహార్ అసెంబ్లీలో బీజేపీకి 80 మంది ఎమ్మెల్యేలు, ఆర్జేడీకి 77 మంది, జేడీయూకి 45 మంది, కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) (లిబరేషన్)కు 11 మంది ఎమ్మెల్యేలు, హిందూస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్)కు నలుగురు, ఇతర పార్టీలు, స్వంతంత్రులు కలిపి ఏడుగురు ఉన్నారు.


















