ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల కలయిక అద్భుతమని కేంద్ర వ్యవసాయ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. ఈ ముగ్గురు కలిసి దేశాన్ని, ఇటు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తున్నారని చెప్పారు. ఎన్డీయే భాగస్వామ్యంలో చంద్రబాబు, పవన్ పాత్రలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. మోడీ-చంద్రబాబు-పవన్‌లను త్రిమూర్తులుగా అభివర్ణించిన ఆయన `విజన్` ఉన్న నాయకులని ప్రశంసించారు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం చెరువు వద్ద వాటర్‌షెడ్ పథకం కింద కోటీ 20 లక్షల రూపాయలతో చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడారు.
దాదాపు 100 సంవత్సరాలపైగా చరిత్ర ఉన్న వెంగళాయపాలెం చెరువును అభివృద్ది చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. దీనిని అద్భుతంగా తీర్చిదిద్దారని.. ఫలితంగా ఎంతో మందికి ఇది ప్రయోజనకరంగా మారుతుందన్నారు. అదేవిధంగా స్థానికుల కు ఉపయోగపడడంతోపాటు పర్యావరణ పరిరక్షణలోనూ కీలక పాత్రపోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా శివరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనను ప్రజలు`మామ` అని సంబోధించేవారని తెలిపారు. తాను ఇక నుంచి ఏపీ ప్రజలకు కూడా మామనేనని వ్యాఖ్యానించారు.
తెలుగు ప్రజలు ఎంతో విజ్ఞానవంతులని పేర్కొన్న చౌహాన్.. వీరికి చంద్రబాబు వంటివిజన్ ఉన్న నాయకుడు లభించడం అదృష్టమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చాలా సంస్కరణలు తీసుకువచ్చారని.. ఇప్పటికీ యువకుడిగా ఆయన ప్రజా సేవలో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. ఆయన విజన్ కారణంగానే హైదరాబాద్ డెవలప్ అయిందన్నది వాస్తవమని పేర్కొన్నారు. అదే తరహాలో ఏపీకి కూడా చంద్రబాబు సేవలు చేరువ అవుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ కూడా ప్రజా సేవ కోసం ఎన్నో త్యాగాలుచేశారని కితాబునిచ్చారు. నేటి తరం రాజకీయ నేతలు చంద్రబాబును చూసి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో అలవరుచుకోవాలని చౌహాన్ సూచించారు.


















