అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో పెను విమాన ప్రమాదం సంభవించింది. రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక ప్రయాణీకుల విమానం, హెలికాప్టర్ గాల్లోనే పరస్పరం ఢీకొన్నాయి. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా ఢీకొని రెండూ పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ఆ సమయంలో విమానం 64 మందితో వెళ్తున్నట్లు తెలిసింది. బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పోటోమాక్ నదిలో రెస్క్యూ బోట్లు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. ప్రమాదం తర్వాత రోనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయాన్ని అత్యవసర ఆదేశం ప్రకారం మూసివేశారు.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం, బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని అధికారులు చెప్పారు. వాషింగ్టన్ డీసీలోని పొటోమాక్ నదిపై గగనతలంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం, హెలికాప్టర్ రెండూ నదిలో పడిపోయాయి. ప్రమాదానికి కారణాలు ఏంటన్నది ఇప్పటికీ తెలియలేదు.
అమెరికా ఎయిర్‌లైన్స్ విమానంలో నలుగురు సిబ్బంది సహా 64 మంది ఉన్నారు. మిలటరీ హెలికాప్టర్లో ముగ్గురు ఉన్నారు.
రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు దగ్గర హెలికాప్టర్, విమానాన్ని ఢీకొట్టింది.
28 మంది మృతదేహాలను గుర్తించామని అత్యవసర సర్వీసుల చీఫ్ జాన్ డొన్నెల్లీ చెప్పారు. 27 మృతదేహాలను విమానం నుంచి, ఓ మృతదేహాన్ని హెలికాప్టర్ నుంచి బయటకు తీసుకొచ్చామని తెలిపారు.
విపరీతమైన గాలి కారణంగా శిథిలాలు ఎయిర్ పోర్టు నుంచి విల్సన్ వంతెన వరకు కనిపిస్తున్నాయని తెలిపారు.
రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్ పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నుంచి రికార్డయిన రెండు ఆడియోలను బీబీసీ ప్రతినిధులు వెరిఫై చేశారు. 60మంది ప్రయాణికులుతో వెళుతున్న విమానానికి దూరంగా వెళ్లమని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు మిలటరీ హెలికాప్టర్‌కు చెబుతున్న విషయం ఓ ఆడియోలో రికార్డయింది.
వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఆడియో సమయం, ప్రమాద సమాయానికి సరిపోలింది.
ఓ ఆడియో క్లిప్‌లో ”పీఏటీ 2-5(హెలికాప్టర్ )సీఆర్జీ(ప్యాసెంజర్ విమానం)ఇన్ సైట్…పీఏటీ 2-5 సీఆర్జేకు స్పందిస్తోంది” అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చెబుతున్నారు. విమానం ఇన్ సైట్. విజువల్ ప్రత్యేకంగా చూపించండి” అని హెలికాప్టర్ పైలట్ అడుగుతున్నట్టు వినిపిస్తోంది.
దాదాపు 15 సెకన్ల తర్వాత వెనక ఎవరో ”ఓ” అని అరుస్తున్న శబ్దం వినిపిస్తోంది.
కంట్రోల్ టవర్‌లో రికార్డయిన మరో ఆడియోలో ప్రమాదానికి ముందు కొందరి మాటలు వినిపిస్తున్నాయి. ”పీఏటీ 2-5 సీఆర్జే ఇన్ సైట్…పీఏటీ 2-5 సీఆర్జే వెనకకు వెళ్తోంది” అని ఫ్లైట్ కంట్రోలర్ చెబుతున్నట్ట తెలుస్తోంది.
మొదటి క్లిప్‌లో ”ఓ” అన్న శబ్దం విన్న కాసేపటికే, దాదాపు 12 సెకన్ల తర్వాత ”టవర్ నువ్వది చూశావా” అని ఎవరో అడుగుతున్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత కంట్రోల్ టీమ్ దగ్గరిలోని విమానాలను దారి మళ్లిస్తున్న మాటలు కూడా ఆడియోలో వినిపిస్తున్నాయి.
రాత్రివేళ వాతావరణం పూర్తిగా అనుకూలంగా ఉందని, పైలట్లు అనుభవమున్నవారని, అంతా బాగానే ఉందని, కానీ ఏదో జరిగిందని రవాణా సెక్రటరీ సీన్ డఫ్ఫీ చెప్పారు. ఆ ప్రాంతంలో విమానం ఉందన్న విషయం హెలికాప్టర్ సిబ్బందికి తెలుసన్నారు.
ఆ ప్రాంతంలో హెలికాప్టర్ ఎందుకు ఎగురుతుందనేదానిపై దర్యాప్తు జరుగుతోంది. హెలికాప్టర్ పైకో, కిందకో, పక్కకో ఎందుకు వెళ్లలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కూడా ప్రశ్నించారు.
ప్రమాదాన్ని వినాశకరమైనదిగా అమెరికా ఎయిర్ లైన్స్ సీఈవో రాబర్ట్ ఐసోమ్ చెప్పారు.
రీగన్ ఎయిర్‌పోర్టులో నైపుణ్యమున్న పైలట్ల అవసరం ఉందని కాంగ్రెస్ సభ్యుడు రోన్ ఎస్టేట్స్ అన్నారు.
దాదాపు 16 ఏళ్లలో అమెరికాలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదమిది.
కాన్సాస్‌లోని విచిట నుంచి విమానం బయలుదేరిందని, 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని, మిలటరీ హెలికాప్టర్లో ముగ్గురు సైనికులు ఉన్నారని వాషింగ్టన్ డీసీ అధికారులు ప్రమాద వివరాలు తెలిపారు.
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:48 గంటలకు కంట్రోల్ టవర్ అలర్ట్ సమాచారం అందింది. వెంటనే 300 మంది సహాయ కార్యక్రమాల కోసం రంగంలోకి దిగారు.
విపరీతమైన గాలి, చీకటి, గడ్డకట్టిన వాతావరణం వల్ల సహాయ కార్యక్రమాలకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.
ఫెడరల్ ఏవియేషన్ అధికార యంత్రాంగం, రవాణా యంత్రాంగం, స్థానిక, రాష్ట్ర యంత్రాంగం అంతా కలిసికట్టుగా సహాయ కార్యక్రమాల ఆపరేషన్ నిర్వహిస్తోందని అమెరికా రవాణా విభాగం సెక్రటరీ సీన్ డఫీ చెప్పారు.
విమాన శిథిలాల సేకరణకు సమయం పడుతుందని వాషింగ్టన్ డీసీ ఫైర్, ఈఎంఎస్ చీఫ్ జాన్ డానెల్లీ చెప్పారు.
విచిట నుంచి విమానం బయలుదేరేటప్పుడు అంతా మామూలుగానే ఉందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జెస్సీ రోమో చెప్పారు.
పొటొమాక్ నది దగ్గరగా ఉన్న ఎయిర్‌పోర్టు దక్షిణ ప్రాంతం అలెగ్జాండ్రియా, వర్జీనియా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం హెలికాప్టర్ల ధ్వని మార్మోగుతోంది.